డెల్టా పల్టా | farmers fire on somireddy | Sakshi
Sakshi News home page

డెల్టా పల్టా

Published Wed, Oct 19 2016 1:56 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

డెల్టా పల్టా - Sakshi

డెల్టా పల్టా


 

  • నీటి విడుదలతో వివక్ష చూపితే ఊరుకోం
  • సోమిరెడ్డిపై మెట్ట రైతుల మండిపాటు
ఆత్మకూరు రూరల్‌ : సోమశిల జలాశయంలో 35 టీఎంసీలకు పైగా నీరు చేరిన క్రమంలో, జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో తొలికారు సాగుచేసుకునేందుకు నీరు విడుదల తేదీని ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. టీడీపీ పోలిట్‌ బ్యూర్‌ సభ్యుడు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జిల్లాలోని రైతులను ప్రాంతాల వారిగా విభజించి డెల్టా, నాన్‌డెల్టా అంటూ వివక్ష చూపడం సరికాదని మెట్ట ప్రాంత రైతులు మండిపడుతున్నారు. జిల్లాకే వరప్రసాదమైన సోమశిల జలాశయం ఉండేది మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు నియోజకవర్గంలోనే అన్న విషయం ఆయన మరచిపోతున్నారని పలువురు రైతులు మంగళవారం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలోనూ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆత్మకూరు శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్యనాయుడుతో సైతం సోమశిల జలాల విడుదల విషయంలో కొంత భేదాభ్రిపాయం ఏర్పడింది. అప్పుడు సైతం మంత్రిగా ఉండిన ఆయన డెల్టా ప్రయోజనాలే కాపాడేందుకు ప్రయత్నించారని మెట్ట రైతులు ఆగ్రహిస్తున్నారు. 2002–03 సంవత్సరంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో సోమశిల ప్రాజెక్ట్‌లో 25 టీయంసీల నీరున్నా తొలికారుకు నీరు విడుదల చేసినప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. పోలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న సోమిరెడ్డికి ప్రాంతాల వారీగా వివక్ష చూపడం రాజ్యాంగ సూత్రాలను అతిక్రమించడమే అన్న విషయం తెలియకపోవడం దారుణమని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. మెట్ట రైతులకు వ్యవసాయం చేయడం తఽప్ప మరో జీవనాధారం లేదు. దీంతో అదును తప్పుతోందన్న ఆదుర్దాతో నీరు విడుదల చేయాలని వారితో పాటు జిల్లా వ్యాప్తంగా రైతులు కోరుకుంటున్నారు.
 
అనాలోచిత నిర్ణయాలే 
జిల్లాలో ఇప్పటి వరకు అధికారులు, రాజకీయ నాయకుల మధ్య సమన్వయలోపంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ మెట్ట రైతులకు అన్యాయం జరుగుతోంది. దీంతో ఏటా తొలుత డెల్టా ప్రాంతానికి నీరు విడుదల చేస్తారు. అనంతరం 20 నుంచి 30 రోజుల వ్యవధి తీసుకుని మెట్ట ప్రాంతాలైన ఉత్తర, దక్షిణకాలువలకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ విధంగా కాలయాపన జరిగి ఆలస్యంగా సాగునీరు అందుతుండటంతో అదునుతప్పి విలువైన కాలం వృధా అవడంతో పాటు ఆశించిన మేర దిగుబడి రాక రైతులకు లక్షలాది రూపాయల నష్టం సంభవించింది. కేవలం గత ఏడాది మాత్రమే డెల్టాతో సమానంగా మెట్ట ప్రాంతానికి నీరు విడుదల చేశారు. దీంతో డెల్టాతో సమానంగా మెట్ట ప్రాంతాల్లోనూ ధాన్యం దిగుబడి సాధించారు. తొలుత గిట్టుబాటు ధర లేకపోవడంతో అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈ ప్రాంత రైతులకు ఏర్పడింది. మెట్టకు లేకుండా ఇటీవలి వరకు డెల్టా ప్రాంతానికి రెండవ కారు నీరు విడుదల చేశారు. అయినా మెట్ట ప్రాంత రైతులు చూస్తూ ఉన్నారే తప్ప తిరుగుబాటు చేయలేదు. పరిస్థితి ఇలానే ఉంటే భవిష్యత్‌లో మెట్ట ప్రాంత రైతులు తిరగబడక తప్పదు అని రైతులు అంటున్నారు. 
తీరువా సమానం.. తీరు ఆక్షేపణీయం
నీటి విడుదలలో వివక్ష చూపుతున్న ప్రభుత్వం డెల్టాతో సమానంగా మెట్ట రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేస్తోంది. ఇన్నాళ్లు తొలుత డెల్టాకు అనంతరం ఇతర ప్రాంతాలకు అంటూ నాయకులు, అధికారులు మెట్ట ప్రాంత రైతులను ఇబ్బందులకు గురిచేశారని, ఇక ఆ వివక్షను సహించబోమని పలువురు రైతులు తెగేసి చెబుతున్నారు. ఐఏబీ సమావేశంలో నీటి నిల్వ అవసరాలు, భవిష్యత్‌ దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించి నీటి విడుదల తేదీని ప్రకటించడం రివాజు. అలా కాకుండా ఐఏబీ సమావేశం గురించి డెల్టా, నాన్‌ డెల్టా విషయాలు మాట్లాడుతున్న తన పార్టీకి చెందిన నాయకులను సోమిరెడ్డి దండించడం చూస్తుంటే తాను చెప్పినట్లే నీటి సంఘాలు వినాలని శాసిస్తున్నట్లుగా ఉందని రైతులంటున్నారు. ఇది సరికాదని హితవుచెబుతున్నారు.
 
రెండు ప్రాంతాలకు ఒకేసారి విడుదల చేయాలి : దేవిరెడ్డి బ్రహ్మరెడ్డి, రైతు, ఆత్మకూరు
డెల్టా, నాన్‌డెల్టా అంటూ సోమిరెడ్డి విభేదాలు చూపేలా ప్రకటనలు చేయడం సరికాదు. డెల్టాతో సమానంగా నీటి తీరువా చెల్లిస్తున్నాం. రెండు ప్రాంతాలకు ఒకేసారి సాగునీరు విడుదల చేయాలి.ఇప్పటికే నార్లు పోసుకునేందుకు దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉన్నాం.
 
వెంటనే నీటి విడుదల తేదీ ప్రకటించాలి : బత్తిన సుబ్బారెడ్డి, రైతు, ఆత్మకూరు
అదును దాటుతుందన్న ఆదుర్దాతో నీరు ఎప్పుడు డిడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నాం. జిల్లాలో వర్షాలు లేకపోయినా పై ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సోమశిలలో నీటి నిల్వ చేరింది. సరైన అదును ఉండడంతో ఇప్పుడే నీరు విడుదల చేయాలి. అధికారులు సమావేశం నిర్వహించి ఎప్పుడు నీరు విడుదల చేసేది ప్రకటించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement