ఎయిర్‌పోర్టు పనులను అడ్డుకున్న రైతులు
ఎయిర్‌పోర్టు పనులను అడ్డుకున్న రైతులు
Published Tue, Jun 20 2017 10:46 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
తమకు న్యాయం చేయాలని డిమాండ్
వైఎస్సార్ సీపీ నేత విజయలక్ష్మి సారథ్యం
తహసీల్దార్ కార్యాలయంలో చర్చలు
మధురపూడి (రాజానగరం) : రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మధురపూడి రైతులు మంగళవారం అడ్డుకున్నారు. తమ భూములకు పరిహారం, సాగునీరు, ఉపాధి, రోడ్లు అందించాలని, సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) నిధులు కేటాయించాలని కోరుతూ రైతులు ఈ చర్యకు ఉపక్రమించారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ జభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వారికి సారథ్యం వహించారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టు అధికారులు, కాంట్రాక్టర్లతో రైతులు ఒక దశలో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా మధురపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోరుకొండ తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. గ్రామానికి రోడ్లు నిర్మించకుండా ఎయిర్‌పోర్టు విస్తరణ, రక్షణ గోడ పనులు చేయడాన్ని రైతులు తప్పుబట్టారు. రైతులు పలు డిమాండ్లతో కూడిన పత్రాన్ని తహసీల్దార్ హుస్సేన్‌కు అందించారు. దీంతో తహసీల్దార్ హుస్సేన్ రైతులను కోరుకొండలోని తన కార్యాలయానికి ఆహ్వానించి చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లను సబ్‌కలెక్టర్ విజయకృష్ణన్, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కోరుకొండ మండల కన్వీనర్ ఉల్లి బుజ్జిబాబు, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గరగ మధు, రైతు విభాగం కన్వీనర్ తోరాట శ్రీను, మధురపూడి రైతు నాయకులు గణేశుల పోసియ్య, ఆకుల రామకృష్ణ, నందెపు ప్రసాద్, పిల్లా పోలీసు, గణేశుల మాణిక్యాలు పాల్గొన్నారు.
ఐక్యంగా ఉద్యమిద్దాం
ఎయిర్ పోర్టు పనులను అడ్డుకున్న రైతులను ఉద్దేశించి జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రైతుల సమస్యల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. భూములు తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వడంలో కాలయాపన చేయడాన్ని ఆమె తప్పు పట్టారు.
Advertisement
Advertisement