అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పూడూరు: అప్పుల బాధతాళలేక ఒంటికి నిప్పంటించుకున్న ఓ రైతు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం కెరవెళ్లి గ్రామానికి చెందిన కావలి యాదయ్య(31) తనకున్న మూడు ఎకరాల్లో గతేడాది పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో అప్పులే మిగిలాయి. పంట పెట్టుబడి కోసం పరిగి ఏడీబీలో రూ. 1.20 లక్షలు, ప్రైవేటుగా మరో రూ. 1.80 లక్షలు అప్పు చేశాడు. ఇక అప్పులు తీరేమార్గం లేక మనోవేదనకు గురైన ఆయన ఈ నెల 13న సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
గమనించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ఉస్మానియా అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున యాదయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య ఉమారాణి, రెండేళ్లలోపూ ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న యాదయ్య మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఉమారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.