రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం
ఉల్లంపర్రు (పాలకొల్లు అర్బన్) : అప్పటివరకు బంధువులు, స్నేహితుల మధ్య ఆ తండ్రీకూతుళ్లు ఆనందంగా గడిపారు. వధూవరులను ఆశీర్వదించి వింధు భోజనం ఆరగించి ఇంటి ముఖం పట్టారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరతారనగా.. వారిని మృత్యువు కబళించింది.
పాలకొల్లు- మార్టేరు రోడ్డులో బ్రాడీపేట శివారు లారీ స్టాండ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నరసాపురం మండలం పాత నవరసపురం గ్రామానికి చెందిన శీలబోయిన విఘ్నేశ్వరుడు (65), అతని కుమార్తె కడలి సుజాత (38) మోటార్ సైకిల్‌పై మార్టేరు సమీపంలోని భట్లమగుటూరు గ్రామంలో ఓ బంధువు వివాహానికి వెళ్లారు. అక్కడ భోజనం చేసి తిరిగి ఇంటిముఖం పట్టారు.
లారీ స్టాండ్ సమీపంలోకి వచ్చే సరికి వారికి ఎదురుగా ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో మోటార్‌సైకిల్ వెనుక వైపు కూర్చున్న సుజాత అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన విఘ్నేశ్వరుడిని 108లో పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా మృతిచెందారు. విఘ్నేశ్వరుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకుని జీవిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా సుజాత భర్త తాతబ్బాయి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాలను పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్వో మండెల నరసింహారావు శవపంచనామా నిర్వహించారు. పట్టణ సీఐ కోలా రజనీకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కె.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ధాన్యం లోడు పగ్గాలు
సక్రమంగా కట్టకపోవడమే కారణమా...
ఆగర్తిపాలెం నుంచి జిన్నూరులోని రైస్‌మిల్లుకు ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ పగ్గాలు సక్రమంగా కట్టకపోవడంవల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో పగ్గం తెగిపోయి ట్రాక్టర్ అదుపుతప్పి ఎదురుగా మోటార్‌సైకిల్‌పై వస్తున్న తండ్రీకూతుళ్లను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ సరెళ్ల ఆనందరావు పరారీలో ఉన్నాడు.
కుక్కలవారితోటలో విషాదఛాయలు
మొగల్తూరు : ఈ ప్రమాదంలో మరణించిన కడలి సుజాత మండలంలోని కుక్కలవారితోటకు చెందిన తాతబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి డిగ్రీ చదువుతున్న కుమార్తె ఝాన్సీ భవానీ, ఇంటర్ చదువుతున్న కుమారుడు పార్థసారథి ఉన్నారు. తాతబ్బాయి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లారు. దీంతో పిల్లల చదువుల కోసం సుజాత మొగల్తూరులో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రితో కలిసి ఓ బంధువు వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా, మరణించారు. ఆమె మరణంతో కుక్కలవారితోటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివాహానికి వెళ్లి వస్తూ..
Published Wed, Apr 20 2016 12:05 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement