పశ్చిమావనిలో 'సీతయ్య' గురుతులు | Nandamuri Harikrishna Memories | Sakshi
Sakshi News home page

పశ్చిమావనిలో 'సీతయ్య' గురుతులు

Published Thu, Aug 30 2018 8:39 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Nandamuri Harikrishna Memories  - Sakshi

పాలకొల్లు అర్బన్‌: రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీ నటుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హరికృష్ణ బుధవా రం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో జిల్లావాసులు, సినీ అభిమానులు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు ది గ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రాంతంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో షూటింగుల నిమిత్తం హరికృష్ణ పలుమార్లు జిల్లాకు విచ్చేశారు. సీతయ్య సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆత్రేయపురం లాకుల వద్ద చిత్రీకరించారు.

 టైగర్‌ హరిశ్చంద్రప్రసాద్‌ సినిమా షూటింగ్‌ను రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లో చిత్రీకరించినట్టు జూనియర్‌ ఆర్టిస్ట్‌ సరఫరా కాంట్రాక్టర్‌ కె.అన్నపూర్ణ తెలిపారు. ఎన్టీ ఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించి షూటింగ్‌లకు వినియోగించే వ్యాన్‌ను చైతన్య రథంగా మార్చి రాష్ట్ర పర్యటన చేసిన సందర్భంలో ఆ వాహనానికి డ్రైవర్‌గా నందమూరి హరికృష్ణ తొలిసారి పాలకొల్లు విచ్చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు నుంచి ఆకివీడు, ఉండి, భీమవరం మీదుగా పాలకొల్లు వచ్చినట్టు అభిమానులు చెబుతున్నారు.  

అప్పుడు సామాన్య కార్యకర్తగా హరికృష్ణ గ్రౌండ్‌లో నిలబడి తండ్రి రామారావు ప్రసంగాన్ని ఆలకించారని ఆనాటి సీనియర్‌ టీడీపీ నాయకులు గుర్తుచేసుకున్నారు. పాలకొల్లు కెనాల్‌ రోడ్డు మీదుగా మార్టేరు వెళుతుండగా చైతన్యరథాన్ని నడుపుతున్న హరికృష్ణను చూసినట్టు పట్టణానికి చెందిన రామా స్టూడియో నాయుడు తెలిపారు. తాను అప్పుడు ఆర్‌ఎంసీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నానన్నారు. ఎర్రవంతెన వద్ద చైతన్యరథం ఆపి కొబ్బరి జట్టు కార్మికులతో ఎన్టీఆర్‌ ముచ్చటించారని చెప్పారు.

 మార్టేరులో నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి పోడూరు మండలం వేడంగిపాలెం సర్పంచ్‌గా పనిచేస్తున్న తాను టీడీపీలో చేరినట్టు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు తెలిపారు. ఆ సమయంలో తొలిసారిగా హరికృష్ణను చూశానన్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలోనూ అన్న ఎన్టీఆర్‌ చైతన్యరథానికి హరికృష్ణ సారథిగా ఉండి రెండోసారి పాలకొల్లు వచ్చారు. లాహరి.. లాహిరి.. లాహిరిలో.. చిత్ర విజయోత్సవాలు పాలకొల్లు మారుతి థియేటర్‌లో నిర్వహించారని, ఆ వేడుకలకు హరికృష్ణ హాజరయ్యారని పట్టణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు షేక్‌ సిలార్‌ చెప్పారు.

స్ఫూర్తిప్రదాత.. హరికృష్ణ
పాలకొల్లు సెంట్రల్‌: రథసారథిగా రాష్ట్రమంతా తిరిగి ఎన్టీఆర్‌ను సీఎం పీఠం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అనంతరం జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల్లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలో రథయాత్రను కొనసాగించారు. ఆ రథయాత్ర పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఇం టి వెంకటరెడ్డి అనే వ్యక్తి హరికృష్ణ యాత్రలో వె న్నంటి ఉండి విజయవంతం చేసినట్టు చెప్పారు. రథయాత్రను నరసాపురం నుంచి ఏనుగువానిలంక, యలమంచిలి, మేడపాడు ప్రాంతాల్లో తిరిగి అనంతరం పాలకొల్లు గాంధీబొమ్మల సెం టర్‌లో జరిగిన సభలో హరికృష్ణ మాట్లాడారు. మార్టేరు, పెనుమంట్ర మీదుగా వీరవాసరం వర కూ హరికృష్ణ యాత్ర కొనసాగింది. అన్న టీడీపీలో తనను జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా అప్పట్లో హరికృష్ణ ప్రకటించినట్టు వెంకటరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయనతో అనుబంధం స్ఫూర్తినిచ్చిందని, ఆయన మరణం తీరని లోటని అన్నారు.

1996లో కురెళ్లగూడెంలో..
భీమడోలు: భీమడోలు మండలం కురెళ్లగూడెంలో 1996లో టీడీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా హరికృష్ణ హాజరయ్యారు. అప్పటి టీడీపీ నేత, ప్రస్తుతం వైఎస్సార్‌ మండల కన్వీనర్‌ రావిపాటి సత్యశ్రీనివాస్‌ ఇంట్లో భోజనం చేశారు. నాటి స్మృతులను ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. 

పసలతో సాన్నిహిత్యం
తాడేపల్లిగూడెం: హరికృష్ణకు టీడీపీ సీనియర్‌ నాయకులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌ అభిమానిగా రాజకీయాల్లో ప్రవేశించిన మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు ఎన్టీఆర్‌కు విధేయుడిగా, హరికృష్ణకు సన్నిహితుడిగా మెలిగారు. 1995లో హరికృష్ణ టీడీపీ మంత్రి వర్గంలో మం త్రిగా ఉన్న సమయంలో పసల ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హరికృష్ణతో కలిసి రాష్ట్రమంతా తాను పర్యటించానని, హరికృష్ణ మరణం తీరనిలోటని పసల కనకసుందరరావు అన్నారు. గతంలో టీడీపీలో పనిచేసిన ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు గుండుబోగుల నాగు లండన్‌ నుంచి సంతా పం తెలిపారు. హరికృష్ణతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement