హేమాచలుడిని దర్శించుకున్న హరికృష్ణ దంపతులు(ఫైల్) పక్కన మాట్లాడుతున్న జగ్గారావు
జనగామ : మానవతావాది...మాటమీద నిలబడే వ్యక్తి.. ఆయన ఆలోచనలు ధర్మపథంగా ఉంటాయి.. గురువులను గౌరవించే కుటుంబం వారిది అంటూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సినీనటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరిక్రిష్ణ చిన్ననాటి స్నేహితుడు, కుటుంబానికి దగ్గరి వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో నివాసముంటున్న యాదగిరి జగ్గారావు కన్నీళ్ల పర్యంతమయ్యారు. తెల్లవారు జామున హరికృష్ణ మరణవార్త తెలుసుకున్న జగ్గారావు. టీవీకి అతుక్కుపోయారు. నాటి స్నేహాన్ని గుర్తుకు చేసుకుంటూ.. తోటి వారితో తన బాధను పంచుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన యాదగిరి జగన్నాథరావు జ్యోతిష్య పండితుడిగా.. గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో సిద్ధాంతిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న జగన్నాథరావుకు ఎన్టీఆర్ తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి నుంచి పిలుపువచ్చింది. వెంటనే 1945లో ఆయన సొంత గ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరుకు వెళ్లారు. జగన్నాథరావుకు ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు జన్మించారు. లక్ష్మయ్య చౌదరి ఆశిస్సులతో అక్కడే స్థిరపడిపోయారు.
జగన్నాథరావు సిద్ధాంతి కావడంతో ఎన్టీఆర్ కుటుంబం ఏ పని ప్రారంభించినా.. ఈయన సలహాలు, సూచనలు తీసుకునే వారు. జగన్నాథరావు కుమారుల్లో ఒక్కరైన యాదగిరి జగ్గారావు కంటే (ప్రస్తుతం జనగామలో నివాసం) ఎన్టీఆర్ కుమారుడు, దివంగత హరికృష్ణ పదేళ్లు చిన్నవాడు. విద్యాభ్యాసం చేయాలంటే పక్క ఊరికి వెళ్లే పరిస్థితి.దీంతో నిమ్మకూరులోనే పాఠశాలను ఏర్పాటు చేసి..అక్కడే హరికృష్ణను చదివించగా.. అప్పటికే గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన జగ్గారావు ఆయనకు తోడుగా ఉండేవారు. కార్తీక పున్నమి రోజున నదీ స్నానం చేసేందుకు.. మచిలీపట్నం మంగినపూడిరేవుకు ఎద్దుల బండిపై హరిక్రిష్ణను తీసుకువెళ్లిన జ్ఞాపకాలు కళ్ల ముందు తేలియాడుతున్నాయని గుర్తుకు చేశారు.
జగన్నాథ సిద్ధాంతికి వృద్ధాప్యం మీద పడడంతో సొంతూరికి వెళ్లాలనే ఆలోచనతో..1970 ఇక్కడకు వచ్చారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని స్టూడియోలో ఒక్కసారి కలుసుకున్నాం. చదువుతో పాటు వినయం, మర్యాద, ఆలోచనలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకునే హరికృష్ణ అకాల మరణం తీరని లోటని జగ్గారావు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
హరికృష్ణకు వరంగల్‌తో అనుబంధం..
హన్మకొండ కల్చరల్ : సినీనటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి హరికృష్ణ మృతి పట్ల జిల్లాలోని ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తొలినాళ్లలో హరికృష్ణ అనేకసార్లు జిల్లాను సందర్శించారు. శ్రీభద్రకాళి అమ్మవారిపై హరికృష్ణకు అమితమైన భక్తి. చాలాసార్లు అమ్మవారిని దర్శించుకున్నారు.
హేమాచలుడికి ప్రియ భక్తుడు హరికృష్ణ
మంగపేట: సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం మృతి చెందడంపై మండలంలోని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల కొండపై స్వయంభువుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామికి ఆయన అత్యంత ప్రియభక్తుడు. 2013లో ఆయన స్వయంగా తన సతీమణితో హేమచలక్షేత్రానికి వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలను పర్యటించి పులకించారు. ఆలయ అభివృద్ధి కొరకు తనవంతు సహాయమందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన మృతి చెందారని తెలియడంతో మండలంలోని ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఆయనతో ఐదేళ్ల క్రితం కలిసిన తీపి గుర్తులను గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment