ప్రమాదంలో నుజ్జునుజ్జయిన టవేరా
ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన మూడు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనల్లో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
– రఘునాథపల్లి/ఏటూరునాగారం/సూర్యాపేట రూరల్
పెళ్లి చూపులకు వెళ్తూ..
ఆదివారం వరంగల్ చింతల్ ప్రాంతానికి చెందిన రెహానాబేగం కుమారుడికి హైదరాబాద్‌లో అమ్మాయిని చూసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు కలసి 9 మంది టవేరా వాహనంలో పయనమయ్యారు. జనగామ జిల్లా గోవర్ధనగిరి దర్గా సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం వెనుక టైరు పేలిపోవడంతో అదుపు తప్పింది. దీంతో బైపాస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న వాహనం మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో వాహనంలో ఉన్న వరంగల్ చింతల్‌కు చెందిన అన్నా చెల్లెళ్లు షౌకత్ అలీ(65), ఫర్జానా బేగం(50), హైదరాబాద్ బోరబండ ప్రాంతానికి చెందిన అఫ్రీన్ సుల్తానా(35) ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వీరితోపాటు వాహనంలో ఉన్న గౌసియా బేగం, హైమత్ అలీ, రోషాన్‌బీ, రెహానా బేగం, ఎండీ హకీమ్, ఎంఈ మైహినాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
స్కార్పియోను ఢీకొట్టిన లారీ
మరో ప్రమాదంలో స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారిపై ఈ ఘటనజరిగింది. ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన తునికాకు కాంట్రాక్టర్ వల్లాల కిష్టయ్య(45) తన వద్ద పనిచేస్తున్న సాంబశివరాజు, రాజేందర్ అనే ఇద్దరు వ్యక్తులతో కలసి ఛత్తీస్‌గఢ్
రాష్ట్రం బీజాపూర్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియోను ఇసుక క్వారీకి వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో కిష్టయ్య, సాంబశివరాజు మృతిచెందగా.. రాజేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రమేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో విషమంగా ఉన్న రాజేందర్‌ను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరగంటలో చేరుకుంటామనేలోపే..
అరగంటలో గమ్యానికి చేరుకుంటామనేలోపే అక్కాతమ్ముడిని మృత్యువు కబళించింది. సూ ర్యాపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి లో బొడ్రాయి ప్రతిష్ట ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సూర్యా పేట మండలం గాంధీనగర్‌కు చెందిన సోదరి రజిత (40)ను పుట్టింటికి తీసుకువచ్చేందుకు కోమటిపల్లి గ్రామానికి చెందిన మాండ్ర శేఖర్ (32) బైక్‌పై సాయంత్రం గాంధీనగర్‌కు వచ్చాడు. అనంతరం ఇద్దరూ కలసి బైక్‌పై కోమటిపల్లి గ్రామానికి బయలుదేరారు. మధ్యలో వీరి బైక్‌ను టాటాఏస్ ఢీకొట్టిం ది. ఈ ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment