గుండెపోటుతో తండ్రి మృతి... ఆగిన కుమార్తె పెళ్లి
మదనపల్లె: తెల్లవారితే తన కుమార్తె పెళ్లి... ఇంతలోనే పెళ్లి కుమార్తె తండ్రి గుండెపోటుతో మృత్యు ఒడికి చేరాడు. దీంతో ఆ యువతి వివాహం ఆగిపోయింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. గుండ్లూరు వీధికి చెందిన సత్యప్రసాద్ స్థానిక ప్రభుత్వ జీఆర్టీ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
మొదటి కుమార్తె సత్యప్రియకు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇల్లంతా పెళ్లిసందడితో కళకళలాడుతోంది. వంటావార్పు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంతలోనే గురువారం సాయంత్రం సత్యప్రసాద్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే సత్యప్రసాద్ కన్నుమూశారు. దీంతో పెళ్లి వేడుక తాత్కాలికంగా నిలిచిపోయింది.