సోనిది హత్యే
► క్షణికావేశంలోనే తండ్రి ఘాతుకం
► పోలీసుల విచారణలో వెల్లడి
►నిందితుడి అరెస్ట్.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ
చండూరు: నల్లగొండ జిల్లా చండూరు మండలం గట్టుప్పలకు చెందిన సోనిది ఆత్మహత్య కాదని, హత్యేనని తేలింది. క్షణికావేశంలో తండ్రే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. సోమవారం నల్లగొండ డీఎస్పీ సుధాకర్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. గట్టుప్పలకు చెందిన బొడిగే కృష్ణకు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గ్రామంలోనే మగ్గం నేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పెద్ద కుమార్తె స్వప్నకు వివాహం చేశాడు. రెండో కుమార్తె మానస, చిన్న కుమార్తె సోని(19) ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇటీవల కృష్ణ మద్యానికి బానిసగా మారి తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు.
కుమారుడు బైక్ తీసుకెళ్లాడని..
గట్టుప్పలను మండలం చేయాలని గ్రామంలో కొద్ది రోజులుగా ఆందోళనలు సాగుతున్నారుు. ఈ నెల 14న గ్రామంలో జరుగుతున్న దీక్ష వద్దకు కృష్ణ తన భార్యతో కలసి వెళ్లాడు. కాసేపటికి కృష్ణ ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు. తన బైక్ కనిపించకపోవడంతో ఎవరు తీసుకెళ్లారంటూ కూతుళ్లను అడిగాడు. తమ్ముడు గణేశ్ తీసుకెళ్లాడని చెప్పడంతో వాడికి తాళం చేతులు ఎవరు ఇచ్చారంటూ ఆగ్రహానికి లోనై వాగ్వాదానికి దిగాడు. దీంతో రెండో కుమార్తె మానస ఏడ్చుకుంటూ పక్కనే ఉన్న నాన్నమ్మ ఇంటికి వెళ్లింది. చిన్న కూతురు సోని మాత్రం తమ్ముడే కదా తీసుకెళ్లింది.. అంటూ తండ్రితో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కృష్ణ.. కూతురు అనే కనికరం లేకుండా ఆమె తలను పట్టుకుని తలుపునకు బాదడంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయింది.
ఆత్మహత్యగా చిత్రీకరించి..
క్షణికావేశంలో కూతురిని హత్య చేసిన కృష్ణ ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పథకం రచించాడు. కూతురు మృతదేహాన్ని స్నానాల గదిలో వేసి కిరోసిన్ పోసి నిప్పంటించి అక్క డి నుంచి వెళ్లిపోయాడు. దారిలో భార్య కనిపించడంతో కూతురు ఒక్కతే ఉంది.. ఇంటికి వెళ్లమని పురమాయించాడు. దీంతో ఆమె ఇంటికి చేరుకుని కూతురు మంటల్లో కాలిపోతుండడాన్ని గమనించి కేకలు వేయగా, ఇరుగుపొరుగు వారు వచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కృష్ణ తన కూతురు మండలం కోసం ఆత్మహత్య చేసుకుందని నమ్మించాడు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా..
తలకు బలమైన గాయం కావడంతో సోని చనిపోరుుందని, అనంతరమే కిరోసిన్ పోసి నిప్పంటించారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు ఉన్నతాధికారులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించాడని డీఎస్పీ వివరించారు.