కన్నతండ్రే కాలయముడు!
– మిస్టరీ వీడిన చిన్నారి అనుమానాస్పద మృతి కేసు
– డిపాజిట్ల సొమ్ము కాజేసేందుకు కూతురినే చంపేసిన తండ్రి
– తండ్రితో పాటు సవితి తల్లి అరెస్ట్
కర్నూలు: బ్యాంకులో డిపాజిట్ సొమ్ము రూ.5 లక్షలను కాజేసేందుకు కన్న బిడ్డనే కడతేర్చిన ఓ తండ్రి ఘాతుకం ఇది. కర్నూలు నగరం ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన తమ్మినేని అశోక్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. కొన్నేళ్ల క్రితం ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన సుధారాణితో వివాహమైంది. అనంతరం మకాంను డోన్‌కు మార్చాడు. పాల ఆటో తోలుతూ జీవనం సాగించేవాడు. వీరికి కుమారుడు, ఒక కుమార్తె సంతానం. భార్య సుధారాణి చీరల వ్యాపారంతో పాటు పోస్టల్ ఆర్‌డీలు సేకరిస్తూ భర్త సంపాదనకు చేదోడుగా ఉండేది.
ఈ క్రమంలో పక్కింట్లో నివాసం ఉంటున్న రఘురామ్ గుప్త కుటుంబంతో పరిచయం పెరిగి సుధారాణి కుమారుడిని దత్తత తీసుకున్నారు. కొంతకాలం తర్వాత చీరల వ్యాపారంలో నష్టం వచ్చి ఆర్థికంగా చితికిపోయారు. ఆర్థిక స్థితులు తట్టుకోలేక రెండేళ్ల క్రితం సుధారాణి ఆత్మహత్యకు పాల్పడింది. ఐదేళ్ల సునీక్షా(కుమార్తె) వివాహ ఖర్చుల నిమిత్తం రఘురామ్ గుప్త రూ.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశారు. డోన్ శివారులో రెండు సెంట్ల స్థలాన్ని కూడా చిన్నారి పేరుతో రాసి బాండ్‌లను తండ్రి అశోక్‌కు అప్పగించారు.
అయితే మద్దికెరకు చెందిన సమీప బంధువు లక్ష్మీని భర్తను వదిలేయడంతో ఆమెను అశోక్ రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లుకు డోన్ నుంచి మళ్లీ కర్నూలుకు కాపురం మార్చాడు. బళ్లారి చౌరస్తాకు సమీపంలోని దుర్గా హోటల్ వెనుకనున్న గణేష్ నగర్ అమీనా కాంప్లెక్స్‌లో నివాసముంటూ చౌరస్తా సమీపంలోని ప్రసన్న మెస్ పక్కన బీడీ బంకు నడుపుతూ జీవనం సాగించేవాడు. కుమార్తె సునీక్షను కొంతకాలం ఇందిరాగాంధీనగర్‌లోని అశోక్ తన తల్లిదండ్రుల దగ్గర వదిలేశాడు.
బాండులను తాకట్టు పెట్టి.. బిడ్డను చంపేసి..
బీడీ బంకు నడుపుకునేందుకు డబ్బులు అవసరం కావడంతో కుమార్తె పేరుతో ఉన్న రూ.5 లక్షల డిపాజిట్‌ను వేరే చోట తాకట్టు పెట్టి రూ.4 లక్షలు అప్పు చేశాడు. వాటిని తిరిగి చెల్లించకపోగా మిగిలిన లక్ష కూడా కాజేసేందుకు రెండో భార్య లక్ష్మీతో కలసి పతకం పన్ని కుమార్తెను హత్య చేశాడు. ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున చిన్నారి సునీక్షాను చిత్రహింసలు పెట్టి గోడకేసి బాదడంతో చనిపోయింది. అనుమానాస్పదంగా మృతి చెందిందని నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తండ్రే ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మొదట 174 సీఆర్‌పీ కింద కేసు నమోదు చేసుకున్నారు.
పోస్టుమార్టం నివేదికతో హత్యగా అనుమానం
చిన్నారి మృతదేహంపై గాయాలు ఉండటంతో మృతదేహాన్ని పంచనామా నిర్వహించగా తలకు, శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో మతిచెందినట్లు డాక్టర్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. దాని ఆధారంగా కేసును 304 ఐపీసీ సెక్షన్ కింద హత్య కేసుగా మార్పు చేశారు. దర్యాప్తులో భాగంగా తండ్రి అశోక్ సవితి తల్లి లక్ష్మిలను అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్తి కోసం చిన్నారిని హత్య చేసినట్లు అంగీకరించారు. నిందితులిద్దరినీ కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఎదుట హాజరుపరిచారు. శనివారం మధ్యాహ్నం నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ జి.వి.నాగరాజరావుతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. వారం రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్టు చేసినందుకు నాల్గవ పట్టణ పోలీసులను డీఎస్పీ అభినందించారు.