కన్నతండ్రే కాటేశాడు
పర్చూరు(ప్రకాశం జిల్లా): కంటి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కాలయముడై కాటేశాడు. తండ్రి దగ్గర తనకు రక్షణ ఉంటుందని భావించిన 11 ఏళ్ల బాలికపై ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో మూగబోయిన ఆ పసిగొంతు బిక్కుబిక్కుమంటూ గడిపింది. అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
చీరాల డీఎస్పీ జయరామరాజు శుక్రవారం సాయంత్రం కేసు వివరాలు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...పర్చూరు మండలం చింతగుంటపాలేనికి చెందిన భవనం పేరిరెడ్డి(35) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం భారతితో అతనికి వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో భారతి భర్తకు దూరంగా బూదవాడలో కూలిపనులు చేసుకుంటూ ఉంటోంది. పెద్దకుమార్తెను తనవద్దే ఉంచుకోగా..చిన్నకుమార్తె (11 ఏళ్లు) తండ్రి వద్దే ఉండి 6వ తరగతి చదువుతోంది. కన్నకూతురిపై కన్నేసిన పేరిరెడ్డి ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. దసరా సెలవులకు ముందు ఒకరోజు సాయంత్రం బాలిక ప్లేట్లు కడుగుతున్నప్పుడు లోపలికి పిలిచి రమ్మని తలుపు వేశాడు.
తండ్రి ఉద్దేశాన్ని గ్రహించిన బాలిక గోడదూకి పారిపోయి పొలంలో తలదాచుకుంది. కొద్దిసేపటి తరువాత గ్రామంలోకి వస్తుండగా బాలికను గుర్తించిన గ్రామస్తులు ఎక్కడి నుంచి వస్తున్నావని అడగడంతో జరిగిన సంఘటనను చెప్పి కన్నీటి పర్యంతమైంది. విషయం తెలుసుకున్న బాలిక నాయనమ్మ దసరా సెలవుల్లో బాలికను తీసుకెళ్లి తల్లి భారతి వద్ద విడిచిపెట్టింది. బాలిక తల్లితో తన గోడు వెళ్లబోసుకుంది. శుక్రవారం గ్రామస్తులు ఈ ఘటనపై చైల్డ్‌లైన్ (1098)కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బి.వి.సాగర్ బూదవాడ గ్రామానికి వెళ్లి బాలికతో, ఆమె తల్లితో మాట్లాడి పర్చూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు పేరిరెడ్డిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చే శారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని డీఎస్పీ జయరామరాజు తెలిపారు.