విధులలో అలసత్వం వహిస్తే చర్యలు
బద్వేలు అర్బన్: విధులలో అలసత్వం వహించినా, రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని వైద్యవిధాన పరిషత్ జాయింట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్‌పి. జయరాజన్‌తో కలిసి స్థానిక ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఓపీ రిజిస్టర్లను , డ్యూటి రిజిస్టర్లను తనిఖీచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నవజాత శిశువు సంరక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుత్రి, ప్రైవేటు ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య సమానంగా ఉందని దీనిని ప్రభుత్వాసుపత్రులలో ఎక్కువ ప్రసవాలు జరిగేలా పెంచాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటి సివిల్ సర్జన్ డాక్టర్ ఎన్.మల్లీశ్వరి, గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గాభవాణి, వైద్యాధికారి డాక్టర్ శిరీష పాల్గొన్నారు.