ఎరువు.. జీఎస్టీ దరువు
► పెరగనున్న ఎరువుల ధరలు
► జిల్లా రైతులపై రూ.35 కోట్లకు పైగా భారం
► పురుగు మందులు మరింత ప్రియం
వస్తు, సేవా పన్ను (జీఎస్టీ) ప్రభావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలు రానున్నాయి. యూరియాతో పాటు అన్నిరకాల రసాయనిక ఎరువుల ధరలు పెరగనున్నాయి. దీంతో వ్యవసాయం భారమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కర్నూలు(అగ్రికల్చర్): జీఎస్టీ ప్రభావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఏర్పడింది. జూలై 1 నుంచి కొత్త పన్ను విధానం అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యూరియా సహా రసాయన ఎరువుల ధరలు ఎంత పెరగొచ్చనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. వాస్తవంగా ఎరువుల ధరల కొన్ని నెలల క్రితమే కొంత మేరక తగ్గాయి. ఇప్పటి వరకు అన్ని రకాల ఎరువులపై వ్యాట్ 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్‌టీ అమలైతే ఏకంగా పన్ను 12 శాతానికి పెరుగుతోంది. అంటే పన్ను భారం అదనంగా 7 శాతం పడుతోంది. అదే స్థాయిలో ధరలు పెరుగనున్నాయి. యూరియా బస్తాపై దాదాపు రూ.18, మిగిలిన ఎరువులపై బస్తాకు రూ.60 నుంచి 100 వరకు పెరిగే అవకావం ఉంది.
యూరియా భారం రూ.4.07 కోట్లు
ఖరీప్ సీజన్‌కు 3,38,077 టన్నుల రసాయన ఎరువులు అవసరమవుతాయి. అన్ని రకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా.. ఇంతవరకు యూరియా ధర మాత్రం పెరగలేదు. ఇది రైతులకు ఊరట కల్పిస్తోంది. ప్రస్తుతం 50 కిలోల బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్‌టీ కారణంగా యూరియా ధర రూ. 316కు పెరుగనుంది. అంటే బస్తాపై రూ.18 వరకు పెరుగనుంది. జిల్లాకు 1,13,312 టన్నుల యూరియా అవసరం అవుతోంది. టన్నుపై రూ.360 వరకు పెరుగనుంది. అంటే కరువు రైతులపై రూ.4.07 కోట్లకు పైగా భారం పడే ప్రమాదం ఏర్పడింది.
ఇతర ఎరువులు..
జిల్లాకు డీఏపీ 65600 టన్నులు, ఎంఓపీ 16432 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు( ఎన్‌పీకే) 1,42,733 టన్నులు అవసరం అవుతున్నాయి. 50 కిలోల బస్తాపై గరిష్టంగా రూ.70 వరకు ధరలు పెరుగనున్నాయి. ఈ మేరకు ఎరువుల కంపెనీల ప్రతినిధులు డీలర్లకు సమాచారం ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే రైతులపై జీఎస్‌టీ భారం ఎక్కువగానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువుల్లో డై అమ్మోనియా సల్పేటు( డీఏపీ) ముఖ్యమైనది. ప్రస్తుతం గరిష్టంగా బస్తా ధర రూ. 1155 వరకు ఉంది. ఈ ధర గరిష్టంగా రూ.1221కి చేరే అవకాశం ఉంది. జిల్లాకు డీఏపీ 65600 టన్నులు అవసరం అవుతుండగా రైతులపై రూ. 8 కోట్లకు పైగా భారం పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం 28.28.0 ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.1134 ఉంది. ఈ ధర రూ.1200 ఆపై పెరిగే అవకాశం ఉంది. 10.26.26, 14.35,14 ఇలా అన్ని రకాల ధరలు పెరుగనున్నాయి. ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం పెరుగుతోంది.
భారం కానున్న పురుగు మందుల ధరలు...
రైతులకు పురుగు మందులు కూడ భారం కానున్నయి. జిల్లాలో ఏటా దాదాపు దాదాపు 50వేల టన్నుల పురుగు మందుల అమ్మకం అవుతున్నాయి. వీటిపై దాదాపు 18 శాతం వరకు ధరలు పెరిగే ప్రమాదం ఉంది. వీటితో వివిధ కంపెనీల బయో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది.