ఎరువులకు నగదు బదిలీతో నష్టం తప్పదు
ఉంగుటూరు: ఎరువులకు నగదు బదిలీ అమలు చేస్తే కౌలు రైతులు నష్టపోతారని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. స్థానిక సీఐటీ యూ కార్యాలయంలో ఆదివారం కౌలు రైతు సమావేశం నిర్వహించారు. భూ యాజమానుల ఆధార్ కార్డుల ఆధారంగానే బయోమెట్రిక్ విధానం ద్వారా ఎరువులు విక్రయిస్తే కౌలు రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. కౌలు రైతులకు నష్టం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు.
కొద్దిరోజులుగా అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం అందించాలన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో వరి, అరటి, కూరగాయలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 2010 నుంచి ఇప్పటి వరకూ రూ.175 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడం దారుణమన్నారు.