జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతిసార బాధితుడు
- జిల్లా కేంద్ర ఆస్పత్రికి క్యూ కడుతున్న జ్వర పీడితులు
- అప్రమత్తత, పరిశుభ్రత ముఖ్యమంటున్న వైద్యులు
సంగారెడ్డి టౌన్: వర్షాకాలంలో వచ్చే జబ్బులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే జిల్లాలో విషజ్వరాలు, అతిసార, డెంగీ, మలేరియా విజృంభిస్తున్నాయి. ఈక్రమంలో డెంగీతో సంగారెడ్డి పట్టణానికి చెందిన బాలరాజు సోలాంకి మృతిచెందిన విషయం తెలిసిందే. కలుషిత నీటితో కౌడిపల్లి మండలం బండ్లపోతుగల్ గ్రామం మొత్తానికి అతిసార సోకింది. వారం రోజులుగా జిల్లా కేంద్ర ఆస్పత్రికి విషజ్వర పీడితులు వస్తూనే ఉన్నారు.
ముందస్తు జాగ్రత్తలు అవసరం
కౌడిపల్లి మండలంలోని చిట్కూల్ గ్రామం, టేక్మాల్ మండలం, శివ్వంపేట మండలాల్లో కొన్ని గ్రామాలు విషజ్వరాలు, అతిసార విజృంభిస్తున్నాయి. జిల్లా మొత్తం వీటి బాధితులు ఎక్కువగానే ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని, వ్యాధుల బారిన పడకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోడ్లపై మురుగు, చెత్తాచెదారం పేరుకుపోవడం.. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. ఫలితంగా మలేరియా, డెంగీ అధికమయ్యే ప్రమాదం ఉంది.
కలుషిత నీరు తాగడం, అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం వల్ల అతిసార సోకుతుందని చెప్పారు. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన వల్ల ఎక్కువగా అంటురోగాలు వ్యాప్తి చెందుతాయన్నారు. నెలలు తరబడి శుభ్రం చేయని ట్యాంకులో నీరు తాగడం కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు. ట్యాంకుల్లో తరచూ క్లోరినేషన్, మురుగుకాల్వలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని వారు సూచిస్తున్నారు.
పరిశుభ్రత ముఖ్యం
పరిశుభ్రంగా ఉంటే ఏ రోగాలు రావు. ఇంటి పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. వాటర్ ట్యాంకులు 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి. తినక ముందు, తిన్న తర్వాత.. మరుగుదొడ్డికి వెళ్లొచ్చిన తర్వాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి. రెండుమూడుసార్లు విరోచనాలు అయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. - డాక్టర్ అమర్‌సింగ్ నాయక్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ
విషజ్వరాలు, వర్షాకాలం, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ