
మద్యంపై యుద్ధం
నెల్లూరు (సెంట్రల్) : ఇళ్లమధ్య మద్యం దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ మహిళలు చేపట్టిన ఉద్యమం మరింత ఉధృతరూపం దాల్చింది. మంగళవారం కూడా జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీలో మద్యం షాపు వద్దంటూ స్థానికులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ధర్నాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు.
స్థానిక బొల్లినేని హాస్పిటల్ సమీపంలో మద్యం షాపు వద్దంటూ సీపీఎం నాయకులు ఎస్‌కే షాహినాబేగం, ఎ.రమమ్మ, ఎస్‌కే షంషాద్ ఆధ్వర్యంలో మహిళలు ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వేపల్లి నియోజక వర్గంలోని ముత్తుకూరులో జనావాసాల మధ్య మద్యం షాపులు వద్దంటూ మహిళలు ధర్నా చేశారు. అక్కడ ఉన్న రెండు దుకాణాలను మూయించారు. వెంకటాచలం మండలం గుడివాడతోపులో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదంటూ ఆందోళన చేపట్టారు. కావలి పట్టణంలోని టీచర్స్ కాలనీలో మద్యం దుకాణం ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ధర్నా చేశారు.