ఒక్కో కిట్‌కు రూ.242 వసూలు
రేషన్ డీలర్లుకు నోటీసులు
చంద్రన్న కానుకలను దిగమింగిన రేషన్ డీలర్లపై చర్యలకు రంగం సిద్ధమైంది. ఒక్కోకిట్టుకు రూ.242 చెల్లించాలని డీలర్లకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే కొందరు దిగమింగిన కానుకల సంబంధించిన నగదు తిరిగి చెల్లించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
గుడివాడ : పట్టణంలో చంద్రన్న కానుకలు బొక్కేసిన రేషన్ డీలర్ల నుంచి నగదును కక్కిస్తున్నారు. ఇప్పటికే కిట్లు లెక్కతేల్చని రేషన్ డీలర్లకు నోటీసులు ఇచ్చి వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం నగదు వసూలుకు రంగం సిద్ధం చేశారు. కొందరు డీలర్లు నగదు చెల్లించగా మరికొందరు ఇంకా చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు పండగ కానుకగా పౌర సరఫరాల శాఖ ద్వారా అందించిన చంద్రన్న కానుకలను కొందరు డీలర్లు దిగమింగారు.
బెల్లం కారిపోయిందని, కొన్ని సరుకులు ఎలుకలు , పందికొక్కులు తిన్నాయని సమాధానం చెప్పి సరిపెట్టేశారు. ఈవిషయాన్ని గతంలోనే సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో రేషన్ డీలర్లకు నోటీసులు ఇచ్చారు. దీనిపై డీలర్లు రకరకాల కారణాలతో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రజాధనం దుర్వినియోగమైందని ఉన్నతాధికారులు నిగ్గు తేల్చినా మనవారే వదిలేయమని అధికార పార్టీ నేతలు నుంచి ఒత్తిడి తెచ్చారు. వీరి స్వార్థం కోసం తమ ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోలేమని రెవెన్యూ అధికారులు తెగేసి చెప్పడంతో దిగమింగిన చంద్రన్న కానుకలకు ఒక్కో కిట్టుకు రూ.242 చెల్లించాలని ఇప్పటికే డీలర్లుకు నోటీసులు జారీ చేశారు.
గుడివాడ పట్టణంలో 45మంది రేషన్ దుకాణాలను డ్వాక్రా మహిళల ముసుగులో తెలుగు తమ్ముళ్లు నడుపుతున్నారు. ఒక్కొక్క డీలరు వద్ద దాదాపు 10నుంచి 20కిట్లుకు పైగా చంద్రన్న కానుకలు లెక్కతేలలేదు. ఈపోస్ యంత్రాలు ఉన్నా లెక్కలేనితనంతో డీలర్లు వ్యవహరించి ఇవి తిరిగి చెల్లించాలని అడిగిన రెవెన్యూ అధికారులపై వత్తిడి తీసుకు రావడం ప్రారంభించారు. మూడు నెలల అనంతరం వీరివద్ద వసూలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే కొందరు డీలర్లు తిరిగి చెల్లించగా మరికొందరు మీనమేషాలు లెక్కిస్తూ కాలం గడుపుతున్నట్లు సమాచారం.
కానుకలు కక్కిస్తున్నారు!
Published Sat, Apr 30 2016 9:00 AM | Last Updated on Sat, Aug 18 2018 9:09 PM
Advertisement
Advertisement