దొంగ గుట్టువిప్పిన ఫిన్స్
దొంగ గుట్టువిప్పిన ఫిన్స్
Published Sun, Aug 14 2016 11:36 PM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM
సాక్షి, అమరావతి :
పోలీసుల ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ విధానం ఓ జేబుదొంగ గుట్టు రట్టు చేసింది. అత్యాధునిక ఫిన్స్ టెక్నాలజీతో నేరగాడి వేలిముద్రలతో క్షణాల్లో అతని చరిత్ర తెలుసుకుని అరెస్ట్ చేశారు. విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విలేకరులకు వివరించారు. తెనాలికి చెందిన పల్లపాటి శ్రీను నేరచరిత్ర గల వ్యక్తి. కృష్ణా పుష్కరాల్లో భాగంగా చేతివాటం ప్రదర్శించేందుకు దుర్గాఘాట్‌కు వచ్చాడు. పుష్కర స్నానం చేయకుండా తచ్చార్లాడుతున్నాడు. అతని ప్రవర్తనపై స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న క్రైం పార్టీ ఎస్‌ఐ బాలశౌరికి అనుమానమొచ్చింది. వెంటనే అదుపులోకి తీసుకుని తన మొబైల్ ట్యాబ్‌లోకి అతని వేలిముద్రలను తీసుకున్నాడు. అందులో అనుసంధానం చేసిన ఫిన్స్ టెక్నాలజీ ద్వారా ఆ వేలిముద్రలను ఇంటర్నెట్ ద్వారా రాష్ట్రంలోని ఆరు లక్షల మంది నేరగాళ్ల వేలిముద్రలతో సరిచూశారు. అంతే క్షణాల్లో అతని గుట్టు తెలిసిపోయింది. తెనాలికి చెందిన పాత నేరస్తుడు శ్రీను వేలిముద్రతో సరిపోయాయి. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ప్రకాశం జిల్లా ఎస్సీ శ్రీకాంత్ ఈ ఫిన్స్ టెక్నాలజీని పరీక్షించారు. ఆ పరిజ్ఞానాన్ని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు పుష్కరాల్లో ఉపయోగించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఈ టెక్నాలజీ పరిక్షించిన పోలీసులు కృష్ణా, గుంటూరు, కర్నూరు జిల్లాలలోని ప్రధాన ఘాట్లలో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. 60 పరికరాలను అందజేశారు. గంటల వ్యవధిలో ఓ నిందితుడిని పట్టుకోవడంతో పోలీసులు విజయవంతం అయ్యారు. పోలీసుల కృషిని సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు.
Advertisement