ముఖ్యమంత్రి సభలో షార్ట్‌సర్క్యూట్
మహారాణిపేట (విశాఖపట్నం) : గురుపూజోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభలో షార్ట్‌సర్క్యూట్ సంభవించింది. అధికారులు అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పింది. శనివారం సాయంత్రం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, అధికారులు, విద్యార్థులతోపాటు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాయంత్రం 4.45 గంటల సమయంలో వేదిక వద్దకు చేరుకున్న సీఎం చంద్రబాబు ముందుగా విద్యార్థులను పలకరించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.
అయితే అదే సమయంలో వేదిక పక్కనున్న విద్యుత్ తీగల్లో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు, పొగలు వ్యాపించాయి. దీంతో వేదికపైనున్న అధికారులు, పాల్గొన్న విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు వెళ్లి వేదికపై అమర్చిన లైట్లకు మాత్రమే విద్యుత్ సరఫరా అయ్యేలా చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కాగా సభా ప్రాంగణంలో మాత్రం చీకట్లు కమ్ముకున్నాయి. ఇదంతా జరిగి విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగి రాగా కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించారు.