బాబుగారూ.. బదులివ్వండి | Intellectuals Forum From Andhra University Open Letter To CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబుగారూ.. బదులివ్వండి

Published Wed, Apr 10 2019 12:50 AM | Last Updated on Wed, Apr 10 2019 12:58 AM

Intellectuals Forum From Andhra University Open Letter To CM Chandrababu Naidu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పలువురు మేధావులు, ప్రొఫెసర్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన బహిరంగ లేఖ ఇది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం సూటిగా సమాధానమివ్వాలని వారు కోరారు. లేఖలోని ప్రధానాంశాలు...

గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులకు
బాధ్యత గల దేశ పౌరులుగా, అయిదు సంవత్సరాలపాటు మీ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ఈ లేఖ రాస్తున్నాం. 
1. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు గనుక దానికి సంబంధించిన సమస్త వ్యయమూ కేంద్రమే భరించవలసి ఉంది. కానీ బీజేపీతో మీకున్న స్నేహాన్ని ఆసరా చేసుకుని ‘దాన్ని మేమే కడతాం. అందుకయ్యే డబ్బు మాత్రం మంజూరు చేయండి’ అని కోరితే, కేంద్రం అంగీకరించి దాన్ని మీ చేతుల్లో పెట్టింది. ప్రాజెక్టు లావాదేవీలకు సంబంధించి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ) ఖాతా తెరవమని సూచించింది. కానీ అయి దేళ్లు కావస్తున్నా మీరు ఆ ఖాతా ఎందుకు తెరవలేదో చెప్పగలరా?

2. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘జాబ్‌ కావాలంటే బాబు రావాలి’ అని మీరు ప్రచారం చేశారు. మీరు సీఎంగా బాధ్యతలు స్వీకరించేనాటికి రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాధన్‌ కమిటీకి ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో తెలియజేశారు. ఈరోజు వరకూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మీరు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను 9 ఏళ్లు పాలించారు. అప్పుడు మీరు ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేకపోయారు. మీ అనంతరం వచ్చిన దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన 5 ఏళ్ల 6 నెలల పదవీ కాలంలో అన్ని విశ్వవిద్యాలయా ల్లోనూ అవసరమైన ఉద్యోగాలన్నీ భర్తీ చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఈ ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకోలేదు. మీ హయాంలో కూడా అదే పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక్క ఉద్యోగమైనా కొత్తగా ఇవ్వలేదు. ఎందరో డాక్టరేట్లు చేసి నిరుద్యోగులుగా మిగిలి పోయారు. ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదో వివరణనిస్తారా?

3. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన రూ. 3,500 కోట్లకు మీరు ఎన్ని శాశ్వత భవనాలు నిర్మించారో చెప్పగలరా? మన రాష్ట్రంలో ఎందరో నిపుణులైన ఇంజనీర్లు, అపార అనుభవం గల కాంట్రాక్టర్లు ఉండగా రాజధాని నిర్మాణం కోసం జపాన్, సింగపూర్, బ్రిటన్‌ తదితర దేశాలవారి సలహాలు, సినీ దర్శకుడు రాజమౌళి వంటి వారి సలహాలు మీకు అవసరమా?

4. లక్షలమంది విద్యార్థినీవిద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రీయింబ ర్స్‌మెంట్‌ బకాయిలకు, స్కాలర్‌ షిప్‌లకు నిధులు మంజూరు చేయ కుండా వాటిని వేరే ప్రయోజనాలకు మళ్లించారు. ఇంతవరకూ కేవలం మూడు నెలలకు మాత్రమే మంజూరు చేశారు. ఈ బకాయిలు చెల్లించక పోవడం వల్ల హాల్‌ టికెట్స్‌ తీసుకుంటున్న సందర్భంలో, పరీక్షలు రాస్తున్న సందర్భంలో పేద విద్యార్థులు ఎన్ని బాధలనుభవించారో మీకు తెలుసా? నిధుల మళ్లింపునకు మీకున్న అధికారం ఏమిటి?

5. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించాక దాన్ని తీసుకు రావలసిన బాధ్యత మీది కాదా? ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని అసెంబ్లీలో ప్రకటించి, దానికి ధన్యవాదాల తీర్మానం చేయిం చింది మీరు కాదా? ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థుల పైనా, యువతపైనా కేసులు పెట్టించలేదా? ఈ సమస్యపై సాగుతున్న ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని అరెస్టు చేయించలేదా? ఇప్పుడు ఏ మొహం పెట్టు కుని కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ కోట్ల రూపాయలు దుబారా చేసి ధర్మ పోరాట దీక్షలు చేశారు? 
6. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రిజర్వ్‌బ్యాంక్, ఎల్‌ఐసీ వారికి ఎకరం రూ. 4 కోట్ల చొప్పున అమ్మారు. అదే చోట ప్రైవేటు విద్యా సంస్థలకు, ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఎకరం రూ. 50 లక్షలు చొప్పున మాత్రమే విక్రయించారు. మిగిలిన రూ. 3.5 కోట్లు ఎవరి జేబు ల్లోకి వెళ్లాయి? వివరిస్తారా?

7. వివిధ రంగాల్లోని పథకాలకు కేంద్రం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు యుటిలైజేషన్‌ సర్టిఫి కేట్‌(యూసీ)లు కేంద్రానికి పంపవలసి ఉంటుంది. ఆ విషయంలో జాప్యం చేయటం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సుమారు రూ. 7,000 కోట్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మన సచివాల యంలో ఒక పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఉన్నతాధికారుల సమక్షంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాష్‌ తెలియజేశారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం గల మీరు సక్రమంగా యూసీలు ఎందుకు పంపలేకపోయారో వివరిస్తారా?

8. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో నిష్ణాతులైన అధికారులు న్నారు. దేశంలోనూ భిన్న రంగాల నిపుణులు ఉన్నారు. వీరిని విస్మరించి పైపై మెరుగుల కోసం, కన్సల్టెన్సీల కోసం ఈ అయిదేళ్లలో రూ. 500 కోట్లు ధారపోశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగు నిర్మాణా నికి రూ.10,000 చెల్లించారు. ఈ విషయంలో వివరణనివ్వగలరా?

9. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు పేరుతో రాజధాని భూముల్ని కారు చౌకగా సింగపూర్‌ కంపెనీలకు స్విస్‌ చాలెంజ్‌ ద్వారా కట్టబెట్టారు. దీని కింద 1,691 ఎకరాలను ఎకరం రూ. 12 లక్షల చొప్పున ఇచ్చారు. నిబం ధనల ప్రకారం రూ. 6,764 కోట్ల విలువైన ఈ భూమినంతటినీ ఈ విధంగా కేవలం రూ. 243 కోట్లకు అమ్మారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరం రూ. 12 లక్షలకు వస్తుందా? ప్రభుత్వ సంస్థ లకు రూ. 4 కోట్లకు అమ్మిన మీరు ఇలా ఎందుకు చేశారు?

10. రాజధాని ప్రాంతం ఎంపికపై శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనబెట్టి మీకు, మీవారికి అనుకూలమైన ప్రాంతంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని, ఆ విషయాన్ని మీ అనుయా యులకు ముందుగా తెలిపి వాళ్లతో కారుచౌకగా భూములు కొనిపిం చారు. ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అవుతుంది. ఆ రకంగా ఇది భారీ కుంభ కోణం. రాజధాని చుట్టూ ఎవరెవరి భూములు రిజస్టర్‌ అయినాయో దర్యాప్తు చేయిస్తే దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడవుతాయి. ఒక ముఖ్య మంత్రి స్థాయి నాయకుడు చేయాల్సిన పనేనా ఇది?

11. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన సభలో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చే స్థోమత ఉందని మీరు అన్నారు. ఇలా మాట్లాడటం ఒక సీఎంగా మీకు తగునో లేదో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. కానీ మీరు దేశంలోకెల్లా అత్యంత ధనిక సీఎం అని తెహల్కా చెప్పిన మాట వాస్తవమేనని ధ్రువపడింది.

12. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు బోధనా సిబ్బంది మినిమం టైం స్కేల్‌ ప్రకటిస్తూ ఫిబ్రవరి నెలలో జీవో నం. 24 జారీచేశారు. దానికి ఇప్పటికీ అతీ గతీ లేకుండా పోయింది. ఈ తరహా ఉద్యోగులు 14 విశ్వ విద్యాలయాల్లో 1,860మంది ఎన్నో ఏళ్లుగా అరకొర జీతాలతో గడుపు తున్నారు. వీళ్ల దయనీయ స్థితి మీకు పట్టదా?

13. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు పంపిన జాబితాపై పక్క రాష్ట్ర సీఎం నెలరోజుల లోపులో నిర్ణయం తీసుకుని పంపిస్తే, మీరు 10 నెలలపాటు ఎందుకు జాప్యం చేశారు? ఆ జాబితాలో ఒక ఎస్సీ, ముగ్గురు బీసీలు, ఇద్దరు ఓసీ న్యాయవాదులు ఉన్నారని, మీ సామాజిక వర్గానికి చెందినవారు ఎవరూ లేరనే కదా ఇంతవరకూ ఆ జాబితాను పంపలేదు!

14. 2014లో మీ పార్టీ మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన ఏ హామీనీ మీరు అమలు చేయలేదని ఏపీ బీసీ అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పల్లపు క్రిష్ణ ఆరోపించారు. జీపీ, ఏజీపీ, పీపీ, ఏపీపీ తదితర నియామకాల్లో చెప్పిన ప్రకారం రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేయకుండా ప్రతిచోటా మీ సామాజిక వర్గానికి చెందినవారినే ఆ పోస్టుల్లో నింపారని కూడా అన్నారు. వివరించగలరా!

15. మీ గ్రామం నారావారి పల్లెకే చెందిన యువ పారిశ్రామికవేత్త నవీన్‌ నాయుడు మీ పాలనలో పారదర్శకత శూన్యం, అది ఉపన్యాసా లకే పరిమితమని ఆరోపించారు. ఉత్తరాదివారికే పనులు కట్టబెట్టి స్థాని కులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అది నిజమా కాదా?

16. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటివి కేంద్ర నిధులకు నోడల్‌ అధికారులను నియమించుకుని ప్రతి పైసా సద్వినియోగం చేసుకుం టుండగా మన ప్రభుత్వం ఆ నిధులను వెనక్కి పంపే స్థితి నెలకొంది. ఇలా రూ. 250 కోట్లు మీరు సరెండర్‌ చేయాల్సి రావడం నిజమేనా?

17. మీ అవినీతి బాగోతంపై 19 కేసులుంటే మీరు స్టేలు తెచ్చు కున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే ఓటుకు కోట్లు కేసులో మీరు ఆడియో, వీడియో ఆధారాలతో దొరికారు. ఈ కేసులేవీ విచారణకు రాకుండా మేనేజ్‌ చేస్తున్నారు. అవునా కాదా?

18. అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌(ఏడీపీ) సమావేశాల నుంచి నన్ను తప్పించండి అని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎందుకు లేఖ రాయాల్సివచ్చింది? రాజధాని స్టార్టప్‌ ఏరియా పేరుతో సింగపూర్‌ కంపెనీలకు స్విస్‌ చాలెంజ్‌కింద 1,691 ఎకరాలు అప్పగించి, అందులో పాల్గొన్న సంస్థలకు కాక సింగపూర్, అమరావతి హోల్డింగ్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దానితో రాయితీల వాటాల ఒప్పందాలు చేసు కున్నారు. దీన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర తప్పుబట్టినా మీరు ఖాతరు చేయలేదు. ఈ విషయంలో ప్రజలకు ఏం చెబుతారు?

19. ఈమధ్య ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి అజేయ కల్లాం ఒక సభలో మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనలు, శిలాఫలకాలకు రూ. 350 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. మీ అనుభవం అవినీతిని పెంచిపోషించ డానికి, వ్యవస్థల నిర్వీర్యానికి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడలేదని చెప్పారు. మీ వివరణ ఏమిటి?

 20. ఐఐఎం, బెంగళూరులోని ఏడీఆర్‌లు కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా ఏపీ ప్రజలను సర్వే చేసినప్పుడు అక్కడి ఓటర్లు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశాలు.. మెరుగైన ఉపాధి/ ఉద్యో గావకాశాలు, తాగునీరు, మెరుగైన అసుపత్రులు/ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాలు అని చెప్పారు. ఈ 3 అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వా నంగా ఉన్నదని సర్వే పేర్కొంది. ఆ 3 అంశాల్లో కనీస సగటును కూడా ప్రభుత్వం అందుకోలేకపోయింది. ఎందుకో ప్రజలకు చెప్పగలరా?}

21. ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ మీరు కేంద్రానికి రాసిన లేఖను కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ బయటపెట్టారు. ఎన్‌డీఏ నుంచి విడి పోయిన అనంతరం కూడా ఈ విషయంలో మరో లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబుతూనే ఇలా ఎందుకు చేశారో చెబుతారా? కేంద్ర మంత్రి రాష్ట్రానికి చేసిన సాయంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అన్ని వివరాలూ చెప్పారు. వాటికి మీరు జవాబు ఎందుకివ్వలేకపోయారు?

22. బీసీలకు మీరు న్యాయం చేయలేదని, పైగా బీసీల ఆత్మగౌ రవం దెబ్బతినే విధంగా బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని కేంద్రా నికి లేఖ రాసిన సంగతిని జస్టిస్‌ ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. క్రిష్ణయ్య పలు సందర్భాల్లో చెప్పారు. మీరు మోదీని అనేకసార్లు కలిసినా చట్టసభల్లో బీసీల కోటా గురించి అడగలే దని, ఆ విషయంలో పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టించిన ఏకైక నాయకుడు జగన్‌ గారేనని కూడా అన్నారు. దీనిపై మీ స్పందనేమిటి?

23. రిటైర్డ్‌ ఉన్నతాధికారులు ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయ కల్లాం, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మారెడ్డి తదితరులు పలు అంశాల్లో గణాంకాలతోసహా అవినీతి గురించి వెల్లడించారు. వాటిపై వివరణనిచ్చే ధైర్యం, దమ్ము మీకుందా?

24. జీవో నం. 5కు భిన్నంగా ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌వారు జనరల్‌ కేటగిరీల్లో రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు అవకాశం లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో గోపాలకృష్ణ ద్వివేదీ ఈ విషయంలో ఒక సర్క్యులర్‌ పంపారు. దాని ప్రకారం రిజ ర్వుడు అభ్యర్థులు (ఎస్సీ, ఎస్టీ,బీసీ, దివ్యాంగులు) జనరల్‌ కేటగిరీలో పోటీపడే అవకాశం ఉంది. దీన్ని కూడా ఏపీపీఎస్సీ చైర్మన్‌ పక్కన బెట్టారు. ఇందువల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆ వర్గాలవారు సీట్లు, ఉద్యోగాలు సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయంలో ఏం చెబుతారు? ఎంతో అనుభవం ఉన్నవారని, మీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని భావించి మిమ్మల్ని సీఎంగా చేస్తే మీ వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టం, అన్యాయం అంతా ఇంతా కాదు. మీపై వచ్చిన అభియోగాలపై వివరణనిచ్చి ఓట్లడిగితే న్యాయంగా, ధర్మంగా ఉంటుంది. మీరు సంజాయిషీ ఇవ్వనిపక్షంలో మీ పాలన అంతా మోసం, దగా, అక్రమం అని అనుకోవాల్సి వస్తుంది. 

ఇంటలెక్చ్యువల్స్‌ ఫోరం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం
ప్రొ‘‘ ఎల్‌. వేణుగోపాలరెడ్డి, మాజీ వైస్‌ ఛాన్సలర్, ప్రొ‘‘ ఈ. విశ్వనాథరెడ్డి,
ప్రొ‘‘ ఆర్‌. నాగభూషణరావు,  ప్రొ‘‘ నల్లా బాబయ్య,
డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రొ‘‘ డి.బి.ఆర్‌.ఎన్‌.కె. బెనర్జీ,
ప్రొ‘‘ డి. ప్రభాకరరావు, ప్రొ‘‘ డి. సువర్ణరాజు, ప్రొ‘‘ కె.తిమ్మారెడ్డి, ప్రొ‘‘ పి. తారాకుమారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement