
చేపల వాన.. నిజమేనా?
గుంటూరు: చేపల వాన కురిసినట్టు ప్రచారం జరగడంతో గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరువారి పాలెం వాసులు పొలాలకు పరుగులు పెట్టారు. తమకు దొరికిన చేపలు తెచ్చుకున్నారు. ఈ ఉదయం పొలాలకు వెళ్లిన వారు చేపలు చూసి ఆశ్చర్యానికి లోనయారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి చేపలు పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు.
కేవలం రెండు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే చేపలు కనబడడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడికి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా చేపల చెరువులు లేవు. ఇక పొలాలకు నీరు అందించే కాల్వలు అడుగంటి ఉన్నాయి. దీంతో చేపలవాన కురిసిందని స్థానికులు గట్టిగా చెబుతున్నారు. ఇంతకు ముందు కృష్ణా జిల్లాలోనూ చేపల వర్షం కురిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే మన దేశంలో చేపలు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.