కృష్ణపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్
-
రూ.300 కోట్లతో అంచనాలు
-
'సైసెఫ్' బృందం పర్యటన
ముత్తుకూరు: మండలంలోని కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై అధ్యయనం చేసే నిమిత్తం సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ అధికారుల (సైసెఫ్–బెంగళూరు) బృందం శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా సైసెఫ్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, ఇంజినీర్ మురళీధర్, ఫిషరీస్ ఏడీ హరికిరణ్, తదితరులు విలేకరులతో మాట్లాడారు. రూ.300 కోట్ల అంచనాలతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుపై ప్రాథమిక అధ్యయనం చేయనున్నామన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 40, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులను సమకూరుస్తుందన్నారు. సముద్రతీరంలో హార్బర్ నిర్మాణంలో బ్రేక్ వాటర్స్ నిర్మాణానికే రూ.200 కోట్ల వ్యయమవుతుందని వివరించారు. బకింగ్‌హామ్ కెనాల్ క్రీక్‌లో హార్బర్ నిర్మాణానికే రూ.30 కోట్లు సరిపోతుందన్నారు. హార్బర్ నిర్మాణానికి ముందు టోఫోగ్రపీ సర్వే, సాయిల్ టెస్టింగ్, తదితర పరీక్షలను నిర్వహించాల్సి ఉందని, అధ్యయనంలో వెల్లడయ్యే అంశాలను సైసెఫ్ డైరెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. 20 రోజుల తర్వాత రెండో సర్వే జరుగుతుందన్నారు. తహశీల్దార్ చెన్నయ్య, ఎఫ్డీఓ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.
‘పోర్టు నుంచి అభ్యంతరం?’
కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పోర్టు నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయేమోనని సైసెఫ్ డీడీ కృష్ణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. ఆర్కాట్‌పాళెం వద్ద మత్స్యకారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి స్థానిక నాయకులు ఈదూరు రామ్మోహన్‌రెడ్డి, ఏకొల్లు కోదండయ్య, మత్స్యకార పెద్దలు యల్లంగారి రమణయ్య, తదితరులు స్పందిస్తూ.. 11 మత్స్యకార గ్రామాలకు అవసరమైన ఫిషింగ్ హార్బర్ కోసం కలెక్టర్, ఎమ్మెల్సీ, అవసరమైతే ముఖ్యమంత్రితోనైనా చర్చిస్తామన్నారు. హార్బర్ లేక చేపల వేట, అమ్మకాలు కోల్పోయి, ఆర్థికంగా దెబ్బతిన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు ఏర్పాటుకు ముందే ఇక్కడ హార్బర్ ఉందని, మినీ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే మహిళలకు ఉపాధి లభిస్తుందని, మత్స్యకార గ్రామాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. జువ్వలదిన్నెకు ఇటువైపు ఉన్న గ్రామాలకు ఇక్కడ నిర్మించే ఫిషింగ్ హార్బర్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఆవుల గోవిందు, అక్కయ్యగారి మొలకయ్య, మత్స్యకారులు పాల్గొన్నారు.