కబళించిన పేదరికం
ఆర్థిక సమస్యలతో తనువు చాలించిన కుటుంబం
♦ ఇంట్లో వస్తువులు అమ్మి..ఆలుబిడ్డలను పొషిస్తూ...
♦ సతులకు అనారోగ్యం.. నిత్యం జీవన్మరణం
♦ దేవుడి వద్దకంటూ కానరాని లోకానికి
♦ ఒకేసారి అందరూకలిసి ఆత్మహత్య
♦ మైలవరం రిజర్వాయర్ చరిత్రలో పెద్ద దుర్ఘటన
ఎప్పుడు ఏ ఆపద వచ్చి చుట్టుముడుతుందో ఎవరికీ తెలియదు. పేదరికానికి తోడు..అనారోగ్య సమస్యలు కుటుంబాన్ని వేధించాయి. మరోవైపు పెళ్లీడుకు వచ్చిన పిల్లలను కళ్లెదుటే చూస్తున్నా అంతో ఇంతో వెనకేసుకోలేకపోయామన్న మనోవేదన కుటుంబాన్ని కుంగదీసింది. ఇంటిలో జరగుబాటులేక..ఒకప్పుడు కొనుక్కున్న వస్తువులను సైతం అమ్ముకుని జీవనాన్ని సాగించారని తెలిస్తేనే మనస్సు తల్లడిల్లిపోతుంది. ఏమి చేయలేక..ఎలా బతకాలో తెలియక కొన్ని రోజులుగా కుటుంబం అనునిత్యం నరకయాతన అనుభవిస్తూ వచ్చింది. సమాజంలో అందరితో సమానంగా జీవించాలన్నా..అనుకున్నన్ని ఆర్థిక పరిస్థితులు లేక తప్పని పరిస్థితుల్లో వారి మరణ శాసనాన్ని వారే రాసుకున్నారు. అందరూ ఒకేసారి కలిసికట్టుగా చివరిసారిగా మెటికల్లో కూర్చొని మాట్లాడుకున్న అనంతరం జలాల్లోకి దూకి తనువు చాలించారు. పేదరికం వలలో చిక్కి ఐదుగురు చనిపోయిన ఘటన అందరినీ కలిచివేసింది.
సాక్షి, కడప/జమ్మలమడుగు రూరల్/మైలవరం : జమ్మలమడుగు మండలం గూడెం చెరువు వద్దనున్నరాజీవ్ నగర్ కాలనీకి చెందిన వాహిద్ (45), భార్యలు షమీమ్‌బేగం, ఆషాబేగం, కుమార్తెలు షబాన, మహబూబ్‌బీ శుక్రవారం మైలవరం రిజర్వాయర్‌లో శవాలుగా కనిపించారు. అయితే ముందురోజు రాత్రే ప్రాజెక్టు వద్దకు చేరుకుని దూకారా? లేక శుక్రవారం తెల్లవారుజామున తనువు చాలించారా?అన్నది తెలియరాలేదు. అయితే వాహిద్ చేసుకున్న ఇద్దరు భార్యల్లో షమీమ్‌కు అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతూనే వస్తోంది. మరోవైపు ఆషాబేగం గుండెజబ్బు నేపథ్యంలో మందులు వాడుతూ వస్తున్నారు. వారి మందుల ఖర్చులకుపెద్ద ఎత్తున వెచ్చించాల్సి వస్తోంది. ముందే సంపాదన అంతంత మాత్రం...అనారోగ్యానికి ఖర్చులు పెరిగిపోతుండడం కూడా వారికి సమస్యగా మారింది.
సమస్యలతో సతమతం
గూడెంచెరువు రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన వాహిద్ ఏడాది కిందటి వరకు ఆయిల్ ట్యాంకర్‌కు డ్రైవర్‌గా వెళుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కాలనీలో ప్రభుత్వ పక్కాగృహంలో నివాసం ఉండేవారు. ఎప్పుడైతే ట్యాంకర్ డ్రైవర్ నుంచి తప్పుకున్నాడో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. భార్యల అభ్యర్థన మేరకు డ్రైవర్ వృత్తి మానుకుని ఇతర పనులు చేసుకునేందుకు సిద్ధమైనా పరిస్థితులు అనుకూలించక నరకయాతన అనుభవిస్తూ వచ్చాడు. వాహిద్‌తోపాటు ఇద్దరు భార్యలు ఏదో ఒక పనికి వెళుతున్నా కుటుంబం ఆర్థిక కోరల్లో ఇరుక్కుని బయటపడలేకపోయింది. దీంతో జీవితం వారికి రానురాను నరకప్రాయంగానే మారి చివరకు తనువు చాలించేలా చేసింది.
పెళ్లీడుకు వచ్చిన పిల్లలు
వాహిద్‌కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె షబానా, చిన్న కూతురు మహబూబ్‌బీ కూడా పెళ్లీడుకొచ్చారు. అంతో ఇంతో వెనుకోవాల్సిన సమయంలో కూడా డబ్బులు మిగులుబాటు లేకపోవడం వేదనకు గురి చేస్తూ వచ్చింది. ఏం చేయాలో అర్థంగాని పరిస్థితుల్లో వారందరూ ఒకేసారి కలిసికట్టుగా మరణ శాసనాన్ని రాసుకున్నారు. పదిమందికి తమ పరిస్థితి తెలియకుండానే కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చినప్పటికీ...గత్యంతరం లేని పరిస్థితుల్లోనే చనిపోవాలనే నిర్ణయానికి వచ్చి రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యకు పూనుకున్నారు.
మైలవరం డ్యాంలో అతి పెద్ద ఘటన
ఆర్థిక కోరల్లో చిక్కి బయటికి రాలేక కుటుంబం ఆత్మహత్యకు పూనుకున్న ఘటన జిల్లాలో సంచలనం రేపింది. మైలవరం ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఘటన చోటుచేసుకోలేదు. గతంలో పదేళ్ల కిందట వినాయక నిమజ్జనం సందర్బంగా ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి ముగ్గురు మృతి చెందారు. అదేపెద్ద ఘటనగా ఇప్పటి వరకు ఉండేది. ప్రస్తుతం వాహిద్ కుటుంబం మొత్తం రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రిజర్వాయర్ చరిత్రలో పెద్ద ఘటనగా మిగిలిపోయింది.
దర్గాకని చెప్పి.. కానరాని లోకానికి
కర్నూలుజిల్లాలో ఉన్న ఎల్లార్తి దర్గా గురువుల వద్దకు వెళుతున్నామని బయలుదేరిన వాహిద్ కుటుంబం నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దర్గాకు వెళుతున్నామని చెప్పి కానరాకుండా వెళ్లారా అంటూ వాహిద్ బంధువులు మృతదేహాలపై పడి రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. అంతేకాకుండా రెండేళ్లలోపే వాహిద్ అన్నదమ్ముల్లో ఇద్దరు ప్రమాదాల్లో మృతి చెందిన నేపథ్యంలో వారు తేరుకోలేకపోతున్నారు. అందులోనూ మైలవరం రిజర్వాయర్ వద్ద నీటిలోకి దిగేందుకు ఉన్న మెట్ల వద్ద ఐదుగురు చివరిక్షణాల్లో కూర్చొని మాట్లాడుకున్న అనంతరం వారు ఒకేమాటపై నీటిలోకి దూకినట్లు తెలిసింది. అసలు ఘటన తలుచుకుంటేనే అందరినీ కుదిపేస్తోంది.