సూరీడు కన్నెర్ర.. ఐదుగురు మృతి
సూరీడి భగభగలతో మెతుకుసీమ కుతకుత ఉడుకుతోంది. బుధవారం వడదెబ్బకు గురై ఐదుగురు మృత్యువాతపడ్డారు. దుబ్బాక మండలంలో ఇద్దరు కూలీలు, కొండపాక మండలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పటాన్‌చెరులో మతిస్థిమితం లేని మహిళ మరణించింది. నిప్పులు కక్కుతున్న సూర్య తాపంలో ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఒకేరోజు వడదెబ్బకు గురై ఐదుగురు మృతిచెందారు.
దుబ్బాక: మండలంలో ఇద్దరు దినసరి కూలీలు ఎండ దెబ్బకు బలయ్యారు. కమ్మర్‌పల్లికి చెందిన కండ్లకోయ సాయిలు (35) మిషన్ భగీరథ పనుల్లో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు క్యూరింగ్ కోసం నెల రోజులుగా నీళ్లు పడుతున్నాడు. బుధవారం ఉదయం 11 గంటలకు ట్యాంకుకు నీళ్లు పడుతుండగా వాంతులు చేసుకుని ఎండలో కుప్పకూలిపోయాడు. ఇది గమనించి న ఇరుగు పొరుగు వారు దుబ్బాక ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడిది స్వగ్రామం గంభీర్‌పూర్ కాగా, అక్కడ ఉపాధిలేక కమ్మర్‌పల్లికి ఐదేళ్ల కింద భార్య, పిల్లలతో వలస వచ్చాడు.
సాయిలుకు భార్య నాగలక్ష్మి, కూతురు రచన, కుమారుడు రవన్ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ ముత్యంపేట భాగ్యమ్మ పర్వతాలు తదితరులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, దుబ్బాకకు చెందిన మత్స్యకారుడు పెంటం నాగరాజు (47) వడదెబ్బ తగిలి మరణించా డు. తీవ్ర వర్షాభావంతో చెరువుల్లో నీరు లేకపోవడంతో నాగరాజు కూలీ పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి విపరీతంగా వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యు లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి, ఇంటికి తీసుకొచ్చారు. కోలుకోని నాగరాజు బుధవారం ఉదయం మరణించాడు. మృ తుడికి భార్య పున్నవ్వ, కూతుళ్లు స్వప్న, మమత, భవాని ఉన్నారు. మృతుడికి కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు భవాని తల కొరివి పెట్టింది.
మతిస్థిమితం లేని మహిళ..
పటాన్‌చెరు టౌన్: మతి స్థిమితం లేని మహిళ ఇస్నాపూ ర్ అట్టల కంపెనీ దగ్గరలో మృతి చెంది ఉండటాన్ని బు ధవారం స్థానికులు గుర్తించారు. 45 ఏళ్ల ఆ మహిళ వడదెబ్బతోనే మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు.
కొండపాక మండలంలో ఇద్దరు..
కొండపాక: మండలంలో బుధవారం వడదెబ్బతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. సిర్సనగండ్లకి చెందిన వేముల యాదవ్వ (45) మంగళవారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగానే వాంతులు చేసుకుంది. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. కాగా, మండలంలోని బందారం గ్రామానికి చెందిన పీరెల్లి యాదగరి (35) బుధవారం కూలీ పనులకు వెళ్లాడు. తీవ్రమైన ఎండలో పనిచేసి అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.