సాక్షి, రాజమహేంద్రవరం :
సర్పంచులను కాదని ఎంపీటీసీలతో జెండాను ఎగురవేయాలన్న నిర్ణయం అమలులో జిల్లాలోని టీడీపీ నేతలు వివక్ష చూపించారు. పంచాయతీ సర్పంచులకు బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రాథమిక పాఠశాలల్లో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీలు జెండా వందనం చేయాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో మాత్రం ‘పచ్చ’పాతం చూపించింది. జిల్లాలో టీడీపీ ఎంపీటీసీలు ఉన్న చోట మాత్రం ప్రభుత్వ నిర్ణయం అమలుకాగా వైఎస్సార్‌సీపీ సభ్యులున్న దగ్గర పలుచోట్ల టీడీపీ సర్పంచులు, ఇతర నేతలు జాతీయ జెండా ఎగురవేశారు. దేవాలయాల్లాంటి పాఠశాలల్లో అధికార పక్ష సభ్యులు పిల్లల సాక్షిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ విపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సోమవారం 70వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని బలభద్రపురం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యురాలు జి.సత్యవతిని ఒక రోజు ముందుగానే ఉపాధ్యాయులు ఆహ్వానించారు. అయితే జెండా వందనం మాత్రం స్థానిక సర్పంచి సీహెచ్ వీరభద్రం చేశారు. దీనిపై ఎంపీటీసీ జి.సత్యవతి ఉపాధ్యాయులను నిలదీశారు. తాము మాత్రం ఏమి చేయగలమని నిస్సహాయత వ్యక్తం చేశారు.
రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పాఠశాలలో స్థానిక వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ చలమల్ల వరలక్ష్మిని కాదని మండల కోఆప్షన్ సభ్యుడితో జెండా ఎగురవేయడానికి టీడీపీనేతలు ప్రయత్నించారు. చివరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ముగించారు. రాజానగరం మండలం జెడ్పీటీసీ అత్యుత్సాహం వల్ల పలు పాఠశాలల్లో స్వాతం త్య దినోత్సవ వేడుకలు మధ్యాహ్నం వర కు జరిగాయి. మండలంలో ఉన్న14 ఉన్నతపాఠశాలల్లో తానే జెండా ఎగుర వేయాలని నిర్ణయించుకున్న జెడ్పీటీసీ పల్లం రత్నం ఆమేరకు పాఠశాలలకు సమాచా రం పంపారు. ఫలితంగా జెడ్పీటీసీ వచ్చే వరకు ఎర్రటి ఎండలో పిల్లలు, ఉపాధ్యాయులు నిలబడాల్సి వచ్చింది. మొత్తం మీద 11చోట్ల జెండా
వందనంలో పాల్గొ న్న ఆయన మరో మూడు చోట్ల మాత్రం టీడీపీ నేతలు జెండా ఆవిష్కరణ చేశారు.
తుని నియోజకవర్గం తొండంగి మం డలం శృంగవృక్షం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ(వైఎస్సార్‌సీపీ)దార్ల లక్ష్మి హాజరయ్యారు. అయితే ఎంపీటీసీకి బదులుగా పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ జాతీయ జెండా ఎగురవేశారు. ఉపాధ్యాయుల తీరుపై దార్ల లక్ష్మి మండల విద్యాశాకాధికారికి ఫిర్యాదు చేశారు.