జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వీధి వీధినా... స్వాతంత్య్రవేడుకలు అత్యంత ఉత్సాహవంతంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో కనుల పండువగా సాగిన ఉత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పతాకావిష్కరణ గావించారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు... నాయకులు హాజరైన ఈ ఉత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు అలరించాయి.
విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ ఎం. హరి జవహర్‌లాల్, జిల్లా పోలీసు సూపరిండెంట్ రాజకుమారితో కలిసి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసే శకటాలను తిలకించి, స్టాల్స్‌ను సందర్శించి పేదలకు ఆస్తులు పంపిణీ చేశారు.
పతాకావిష్కరణతో ఉత్సవాలు ప్రారంభం..
పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఆమెకు పోలీసులు, ఇతర రక్షకభటులు గౌరవ వందనం చేశారు. అనంతరం శాంతికి సూచికగా పావురాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మూడు నెలల్లో చేసిన కార్యక్రమాలు, రానున్న ఏడాది కాలంలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు.
పనితీరుకు ప్రశంస..
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వారికి ఉప ముఖ్యమంత్రి వాటిని అందజేశారు. జిల్లాలో 87 శాఖలు, వివిధ విభాగాలకు చెందిన 430మంది ప్రశంసా పత్రాలు అందికున్నవారిలో ఉన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో మంచి ప్రగతి కనపరిచిన వారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా చేసిన వారికి, వివిధ శాఖల్లో విధుల్లో మంచి పనితీరు కనపరిచిన వారికి ఈ ప్రశంస దక్కింది.
అదరహో అనిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎనిమిది పాఠశాలలకు చెందిన పిల్లలు దేశభక్తి పెంపొందించే గీతాలకు నృత్య ప్రదర్శన చేశారు. ఎవరికి వారే పోటీ, ఎవరికి వారే సాటి అన్న రీతిలో సాగిన ప్రదర్శనలు ఆహూతులను అలరించా యి. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలు, స్వా తంత్య్ర సమరయోధుల పోరాటం, దేశ గొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టత చాటిచెబుతూ రచించిన గే యాలకు విద్యార్థులు చూడ ముచ్చటగా నృత్యాలను ప్రదర్శించడం విశేషం. ముందుగా వివిధ పాఠశాల విద్యార్థుల మాస్ డ్రిల్‌తో కార్యక్రమం మొదలైంది. తర్వాత విజయనగరం గరŠల్స్ హైస్కూల్ విద్యార్థినులు వందేమాతరం గేయానికి స్థానికంగా ప్రాచుర్యం పొందిన కర్ర, కత్తి సాములు జోడించి ప్రదర్శన ఇచ్చారు. ఫోర్ట్ సిటీ విద్యార్థులు ఐ యామ్ ఇండియన్ గేయానికి, కేజీబీవీ విద్యార్థినులు ఒకే ఒక్క ఓంకారం అన్న గీతానికి, సెయింట్ మేరీస్ విద్యార్థులు దేశభక్తి గీతానికి, ద్వారకా తిరుమల అంధుల పాఠశాల విద్యార్థులు మేరా భారత్, జిల్లా పోలీసు వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు మేమే ఇండియన్స్, కొత్తవలస ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పుణ్యభూమి ఈ భరతదేశం, బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇండియా వాలా గేయాలకు నృత్య ప్రదర్శన అందించారు. ఇందులో ద్వారకామయి అంధుల పాఠశాల విద్యార్థులు, ఏపీ మోడ ల్ స్కూల్ విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థుల ప్రదర్శనలకు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక బహుమతి గెల్చుకున్నారు.
రూ.336.86కోట్ల ఆస్తులు పంపిణీ..
ఉత్సవంలో భాగంగా పేదలకు రుణాలు, ఆస్తులు పంపిణీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, కలెక్టర్ హరి జవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారి తదితరులు వాటిని అందజేశారు. మైదానంలో మొత్తం 18శాఖలు తమ ప్రగతిని, పథకాలను తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇందులో ఆరుశాఖలు పేదల కు రూ.336.85కోట్ల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశా యి. డీఆర్‌డీఏ–వెలుగు అధికారులు 8642 సంఘాల కు రూ.298.55కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 4087 మందికి రూ.19.47కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేశారు. వైఎస్సార్ బీమా కింద 456 మందికి రూ.8.36కోట్లు సాయం అందజేశారు.252 రైతు సంఘాలకు రూ.1.26 కోట్లు రుణాలు ఇప్పించారు. విభిన్న ప్రతిభావంతులశాఖ ద్వారా 8మందికి రూ.50వేలు వంతున, బీసీ కార్పొరేషన్ ద్వారా 34మందికి రూ.41.04కోట్లు, కెనరాబ్యాంకు, డీసీసీబీ 9మందికి రూ.15లక్షలు, డీపీవో ద్వారా 2289మందికి రూ.4.65కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 68మందికి రూ.2కోట్లు విలువ గల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్‌చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో జె.వెంకటరావు, విజయనగరం ఆర్డీవో జె.వి.మురళి, ఇతర అధికారులు, వైఎస్సార్‌సీపీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మజ్జిశ్రీనివాసరావు, పెనుమత్స సురేష్‌బాబు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment