
సాక్షి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో రాష్ట్ర్రస్థాయి సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. క్రీడల పట్ల తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. విజయనగరంలో కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.
క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించాలి: బొత్స
పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వసతులను వినియోగించుకుని.. క్రీడాకారులు మంచి ఫలితాలు సాధించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు. ఈ స్టేడియానికి అవసరమైన అన్నీ మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. పట్టణంలో ఖాళీ స్థలాలు ఉన్న అన్ని పార్కుల్లోనూ ఆటస్థలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా వుండాలంటే.. విద్యతో పాటు వ్యాయామం అవసరమన్నారు.
పీవీ సింధును ఆదర్శంగా తీసుకోవాలి: పుష్పశ్రీవాణి
రాష్ట్రంలోని క్రీడాకారులంతా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సింధును ఆదర్శంగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. ఓటమికి నిరుత్సాహపడి కృంగిపోకుండా విజయం సాధించే వరకూ ప్రయత్నించాలన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నగదు బహుమతులు అందజేస్తోందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment