
సాక్షి, విజయనగరం: అశోక్ గజపతిరాజు మాన్సాస్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ వ్యవహారాలు ఉంటే వారిలో వారు చక్కదిద్దుకోవాలన్నారు. మహారాజ కళాశాల వ్యవహారంలో మాన్సాస్ వలన విద్యార్థులకు, అధ్యాపకులకు నష్టం వాటిల్లుతుంటే తమ పరిధి మేరకు చర్యలు చేపడతామని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఎంఆర్ విద్యాసంస్థలను అన్ ఎయిడెడ్ చేయమని గతంలో అశోక్ గజపతే ప్రభుత్వాన్ని కోరినట్టు మాన్సాస్ చైర్మన్ సంచయిత తెలిపారని ఆయన చెప్పారు. తామెప్పుడు మాన్సాస్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదని, ప్రజలకు నష్టం కలిగితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ నిర్వహణపై పట్టణానికి చెందిన ప్రముఖులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. (చదవండి: రాజకీయాలతో ముడిపెట్టొద్దు: బొత్స)