వచ్చే నెల 28 నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్
-
నిర్వహణకు రూ.2 కోట్లు
-
కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట):
జిల్లాలో ప్రతిష్టాత్మకమైన ఫ్లెమింగో ఫెస్టివల్‌ను వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించిందన్నారు. ఫెస్టివల్ నిర్వహించే బీవీపాళెం, నేలపట్టు తదితర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. స్వచ్ఛభారత్, ఉపాధి హామీ పథకం ద్వారా టాయిలెట్స్, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. నేలపట్టులోని అతిథి గృహానికి మరమ్మతులకు నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఫెస్టివల్ నిర్వహణకు అవసరమైన నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలల్లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఫెస్టివల్ సందర్భంగా సూళ్లూరుపేటలో ట్రాఫిక్ ఐలాండ్లు అభివృద్ధి చేయాలన్నారు. రోడ్డు చుట్టుపక్కలా మొక్కలు నాటలన్నారు. నేలపట్టు చెరువుకు తెలుగుగంగ నీటిని విడుదల చేయాలన్నారు. పర్యటకుల కోసం బోట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో జేసీ ఇంతియాజ్, జేసీ–2 రాజ్‌కుమార్, పర్యటక శాఖ ఈడీ చంద్రమౌళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, టూరిజం అ«ధికారి నాగభూషణం పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయండి.
జిల్లాలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పర్యాటక రంగం అభివృద్ధికి చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపించకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.