కన్నీటి వరద
-
మూడు రోజులకు వెలుగు చూసిన ఘటన
-
తుంగవాగులో తేలిన మృతదేహాలు
జిల్లాలో ‘కన్నీటి’ వరద పోటెత్తింది. భారీ వర్షాలతో వచ్చిన బీభత్సం సృష్టించింది. నిండు ప్రాణాలను బలిగొంది. రైతన్నలకు అంతులేని నష్టాలను మిగిల్చింది. సదాశివనగర్ తుంగవాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మూడ్రోజులకు మృతదేహాలు బయటపడడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మరోవైపు, పడగల్ నవాబ్ చెరువు అలుగు వరదలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం సోమవారం లభ్యమైంది. పంట పొలాలను చెరువులుగా మార్చిన వరద.. అన్నదాతలను నిలువునా ముంచింది. వేల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది.
సదాశివనగర్:
పోటెత్తిన తుంగవాగు ఇద్దరు యువకులను బలిగొంది. మూడ్రోజుల క్రితం వరద ఉద్ధృతికి గల్లంతైన యువకులు మృతి చెందారు. సదాశివనగర్ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సదాశివనగర్‌కు చెందిన రైతు పోలబోయిన లచ్చయ్య, కళావతి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్నవాడైన రంజీత్‌కుమార్ (23) ఆర్నెల్ల క్రితమే విదేశాల నుంచి తిరిగివచ్చి, ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కోతి భూంరెడ్డి, భాగ్యలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (21) కామారెడ్డిలోని ఓ హోటల్‌లో సూపర్‌వైజర్. స్నేహితులైన రంజీత్, విష్ణు శనివారం సాయంత్రం బైక్‌పై గిద్ద గ్రామంలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. రామారెడ్డి ప్రధాన రహదారిపైకి అప్పటికే వరద చేరగా, ఆ నీటిలోంచే వారు వెళ్లారు. అదే రాత్రి 9 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అప్పటికే భారీ వర్షం కురియడంతో వాగులో వరద ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఇది గమనించని రంజీత్, విష్ణు వాగు దాటేందుకు యత్నించారు. వరద ఎక్కువగా ఉండడంతో బైక్‌తో సహా కొట్టుకుపోయారు.
అయితే, ఎంతకీ వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. అంతకు ముందే బయల్దేరుతున్నామని చెప్పిన పిల్లల ఫోన్లు అంతలోనే స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులను వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. అయితే, సోమవారం ఉదయం కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై నాగరాజు, సిబ్బంది వచ్చి చూడగా, రంజీత్‌కుమార్ మృతదేహం కనిపించింది. సమీపంలోనే విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహం, బైక్‌ను గుర్తించారు. విగతజీవులుగా మారిన యువకులను చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కామారెడ్డి రూరల్ సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.