
వరదొస్తే అమరావతి అతలాకుతలమే
సాక్షి, హైదరాబాద్: చెన్నైలో బీభత్సం సృష్టించిన వరద అమరావతి ప్రాంత ప్రజలను, సీఆర్‌డీఏ అధికారులను ఆలోచనలో పడేసింది. అంతటి వరద కాదు.. అందులో కొంత వచ్చినా అమరావతి అతలాకుతలం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిని 50 వేల ఎకరాల్లో నిర్మించేందుకు సర్కారు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. సాధారణ వర్షపాతానికే 13 వేల ఎకరాలు, భారీ వర్షాలు కురిస్తే 25 వేల ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రాంతంలో చెన్నైలో కురిసిన కుంభవృష్టి కురిస్తే మొత్తం రాజధాని నీట మునగడం ఖాయమని అధికారులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.
రాజధాని కమిటీ అన్వేషణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో అమరావతికి ముంపు ప్రమాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. వరద ప్రమాదం గురించి ‘మాస్టర్‌ప్లాన్’లో సింగపూర్ కంపెనీలు కూడా హెచ్చరించాయి. కొత్త రాజధానిని ముంచేయడానికి, వరద బీభత్సాన్ని రుచి చూపించడానికి కొండవీటి వాగు ఒక్కటి చాలని, దానికి తోడు కృష్ణా నది ఉప్పొంగితే.. అంచనాలకు అందనంత ప్రమాదం తప్పదనీ ఇటు పట్టణ ప్రణాళిక, అటు నీటి పారుదల రంగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నై వరద పరిస్థితి చూసిన తర్వాత.. సచివాలయంలో ఏ శాఖ అధికారిని కదిలించినా తుఫాన్లు, వరదల సమయంలో అమరావతి ఎంత భద్రం? అనే అంశం మీదే చర్చిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని సాధారణ ప్రజల్లో, సీఆర్‌డీఏ అధికారుల్లో కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
భారీ వర్షాలు కురిస్తే భద్రత కరువే
‘వాతావరణ మార్పుల ఫలితంగా కుంభవృష్టి కురిసే అవకాశాలు పెరుగుతున్నాయి. చెన్నైలోనూ 100 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేస్తూ కుంభవృష్టి కురిసింది. కొండవీటి వాగు 63 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. వాగు పొడవునా పొలాల్లో కురిసిన వర్షం వాగులోకి చేరుతుంది. కుంభవృష్టి కురిస్తే వాగు సామర్థ్యానికి మించి వచ్చే నీటితో ఆ ప్రాంతం జలమయమవుతుంది. పట్టణీకరణ జరగక ముందే 25 వేల ఎకరాలకు పైగా ముంపునకు గురయ్యే ప్రాంతంలో రాజధాని నిర్మిస్తే ముంపునకు గురయ్యే విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. అంటే కుంభవృష్టి కురిస్తే కేవలం కొండవీటి వాగు వల్లే రాజధాని ప్రాంతం మొత్తం జలమయం అవుతుంది. కృష్ణా గరిష్ట వరద ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ముంపు ప్రమాద తీవ్రత రెట్టింపవుతుంది. రెండింటి ప్రభావాలను పరిగణనలోకి తీసుకుంటే.. సాధారణ వర్షాలకే ముంపు ప్రమాదం పొంచి ఉంటుంద’ని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్‌లో చెప్పిన సింగపూర్
అమరావతిలో వరదల ప్రమాదం గురించి సింగపూర్ కంపెనీలు ముందే హెచ్చరించాయి. కొండవీటి వాగులో మెరుపు ప్రవాహాలు(ఫ్లాష్ ఫ్లడ్స్) ఉంటాయని, సాధారణ ప్రణాళికలతో సరిపెట్టకుండా నిపుణులు రూపొందించిన ప్రణాళికల మేరకు వరద నియంత్రణ కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలో ‘లో, మీడియం, హై ఫ్లడ్ లైన్స్’ ఉన్నాయని మాస్టర్‌ప్లాన్‌లో స్పష్టంగా చెప్పారు. ‘రాజధాని ప్రాంతంలో వర్షాకాలంలో 13,500 ఎకరాలు నీట మునుగుతుందని, ఏటా రెండు, మూడు నెలలు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఒక్కోసారి ముంపునకు గురైన తర్వాత.. 5-7 రోజుల పాటు నీటిలోనే ఉంటుంది. ఇలాంటి 13,500 ఎకరాల్లో 10,600 ఎకరాలు రాజధాని ప్రణాళిక ప్రాంతంలోనే ఉన్నాయి’ అని మాస్టర్‌ప్లాన్‌లోని 82వ పేజీలో స్పష్టంగా పేర్కొంది.
భారీగా నిధులు అవసరం
కొండవీటి వాగు వరద ప్రభావాన్ని తగ్గించడానికి కనీసం రూ. 1,500 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ కమిషనర్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. కేవలం కొండవీటి వాగు వదర ఉధృతిని తగ్గించి, అమరావతి ముంపునకు గురికాకుండా చేయడానికే ఈ నిధులు సరిపోతాయి. కృష్ణానది ఉప్పొంగితే వచ్చే ప్రమాదాన్ని నివారించేందుకు భారీగా నిధులు వెచ్చించాలని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. కేవలం వరద నియంత్రణకే భారీగా నిధులు వెచ్చించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
కొండవీటి వాగు స్వరూపం
► కొండవీడు కొండల దిగువన కొండవీటి వాగు ప్రారంభమవుతుంది. పేరేచర్ల, మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 12 గ్రామాల పక్కన ప్రవహిస్తూ ఉండవల్లి దిగువన కృష్ణానదిలో కలుస్తుంది.
► ఏటా సాధారణ వర్షాల సమయంలో 4-5 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుంటుంది. పొట్టేళ్లవాడు, పాలవాగు, అయ్యన్న వాగుల నుంచి వచ్చే వర దనీరు మొత్తం తుళ్లూరుకు ఎగువన కొండవీటి వాగులో కలిసిన తర్వాత ఉధృతి తీవ్రమవుతుంది. 25 వేల క్యూసెక్కుల గరిష్ట వరద వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. మెరుపు వేగంతో వరద పోటెత్తడం ఈ వాగు ప్రత్యేకత. అలాంటి సమయాల్లో వరద ప్రవాహ వేగం సాధారణం కంటే కనీసం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
► ఈ వాగు పొంగితే ఏటా తుళ్లూరు మండలంలోని మందడం, వెలగపూడి, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, వెంకటపాలెం, యర్రబాలెం, తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామాలకు చెందిన పంట పొలాలు ముంపునకు గురవుతుంటాయి.
► ఏటా మామూలు వర్షాలకే 13,500 ఎకరాల విస్తీర్ణంలోని పంటలు మునుగు తుంటాయి. భారీ వర్షాలు కురిస్తే.. 25 వేల ఎకరాలకు ముంపు తప్పదు. ఇది స్థానికులకు అనుభవం నేరిపన పాఠం
సీఆర్‌డీఏ ప్రణాళిక ఫలించేనా?
► కొండవీటి వాగు కృష్ణాలో కలిసే చోట ప్రత్యేకంగా స్లూయిస్ నిర్మాణం ఏర్పాటు చేయాలి. కృష్ణానది పోటెత్తినప్పుడు వాగులో నీరు ఎగదన్ని ముంపు ప్రభావం పెరగకుండా ఉండటం కోసం రెగ్యులేటర్ మాదిరి స్లూయిస్ పనిచేస్తుంది. కృష్ణానది ప్రవాహ మట్టం కంటే వాగు బెడ్ లెవల్ ఎక్కువ. కృష్ణా నీటిని బలంగా నియంత్రిచకపోతే.. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
► ముంపును నివారించేందుకు కొండవీటివాగు నీటిని కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వలోకి మళ్లించేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. దీనివల్ల వాగు పోటెత్తినప్పుడు రాజధాని ప్రాంతం ముంపునకు గురి కాకుండా నీటి ప్రవాహం సాఫీగా ఉంటుంది. వాగు ఎగువన నాలుగు చోట్ల రిజర్వాయర్లు నిర్మించి నీటి ప్రవాహాన్ని నియంత్రించాలని ప్రణాళికలు రూపొందించింది.