కోడెల వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోండి
ఏపీ సీఎస్, సీఈసీకి కేంద్ర హోంశాఖ లేఖ
నరసరావుపేట: ఓ టీవీ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల సందర్భంగా తనకు రూ.11.5 కోట్లు ఖర్చయిందంటూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై తాను రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని, దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసిందని ప్రముఖ న్యాయవాది, గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జి.అలెగ్జాండర్ సుధాకర్ తెలిపారు.
ఈ మేరకు భారత ప్రభుత్వ కార్యదర్శి ఎ.కె.ధావన్ నుంచి విడుదలైన లేఖ మంగళవారం తనకు అందిందన్నారు. ఒక ఎమ్మెల్యేగా పోటీచేసే వ్యక్తి రూ.28 లక్షలు మించి ఖర్చు చేయరాదని భారత ఎన్నికల కమిషన్ పరిమితి విధించిందని, దీనికి విరుద్ధంగా తనంతట తానే స్వయంగా ఇంటర్వ్యూలో స్పీకర్ కోడెల చెప్పిన అంశాన్ని తాను రాష్ట్రపతి, భారత ఎన్నికల కమిషన్‌ల దృష్టికి జూన్ 21న తీసుకెళ్లానని తెలిపారు.
(చదవండీ: ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు)