మండలాల కోసం లొల్లి | For Zones lolli | Sakshi
Sakshi News home page

మండలాల కోసం లొల్లి

Published Sat, Aug 27 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

For Zones lolli

  • మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు మానుకోట నాయకుల డిమాండ్‌
  • ప్రభుత్వంపై ఒత్తిడికి సన్నద్ధం
  • మహబూబాబాద్‌ : మానుకోట జిల్లా కోసం తీవ్రస్థాయిలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాల పునర్విభజన ముసాయిదా లో మానుకోట పేరు ప్రకటించగా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ పలు గ్రామాల ను మండలాలు చేయాలని, రెవెన్యూ డివిజన్లు చేయాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఆయా డిమాండ్ల సాధనకు నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. మానుకోట జిల్లా 12 మండలాలతో ఏర్పాటు కానుంది. ఇందు లో మానుకోట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, డోర్నకల్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, ములుగు డివిజన్‌లోని కొత్తగూడ మండలాలు ఉన్నాయి. 7,54, 845 జనాభా, 3463.89 కిలోమీటర్ల విస్తీర్ణంతో జిల్లా ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాత రెవెన్యూ డివిజన్‌లో 16మండలాలు ఉన్నాయి. ఇప్పుడు మండలాలు తగ్గించారు. అయితే మండలాల సంఖ్య కనీసం 16కు పెంచాలని, మానుకోట తోపాటు మరో రెవె న్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష రాజ కీయ పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేయడంతోపాటు పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.
     
    తొర్రూరు రెవెన్యూ డివిజన్‌ కోసం...
    కేసముద్రం మండలం ఇనుగుర్తి, మరిపెడ మండలం చిన్నగూడూరు గ్రామాలు మండలాలుగా, తొర్రూరును రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని, పారిశ్రామికవాడగా మార్చేందుకు ఇల్లందును కూడా మానుకోటలో చేర్చాలంటూ మానుకోట జిల్లా సాధన కమిటీ తాజా గా డిమాండ్‌ చేస్తోంది. కొత్తగూడెం నుంచి బయ్యారం, ఇల్లందు మధ్య సుమారు 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజ సంపద ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇల్లందును మానుకోట జిల్లాలోనే కలపాలని డిమాండ్‌ వస్తోంది. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా చేయాలని గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు జిల్లా సాధన కమిటీ నాయకులు మద్దతు తెలిపారు.
     
    ఇల్లందు కలపాలని...
    జిల్లాల పునర్విభజన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్‌ రాంచంద్రునాయక్‌ మానుకోటలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మరుసటి రోజు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇల్లందును మానుకోట జిల్లాలోనే కలపడంతోపాటు రెవెన్యూ డివిజన్‌గా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డోర్నకల్‌ నియోజకవర్గంలోని చిన్నగూడూరును మండలకేంద్రంగా, మరిపెడను డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ మండలఅధ్యక్షుడు కొండపల్లి రాంచందర్‌రావు మానుకోట మండలం వీఎస్‌.లక్ష్మీపురం, జంగిలిగొండ, సింగారం గ్రామాలను ఇతర మండలాల్లో కలిపే ప్రయత్నాలు చేశార ని ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఆ గ్రామాలు మానుకోట మం డలంలోనే ఉండటంతో ఆందోళన విరమించారు. డోర్నకల్‌ నియోజకవర్గంలోని చిన్నగూడూరును మండలకేంద్రం చేసి దాశరథి పేరు పెట్టాలనే డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా చేస్తే మానుకోట మండలంలోని కొన్ని గ్రామాలు కలిపే అవకాశం ఉంది. దీంతో మళ్లీ ఆయా గ్రామాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలవుతాయి. మానుకోట జిల్లా ఏర్పాటులో తొర్రూరు రెవెన్యూ డివిజన్‌గా చేయాలని అన్నిపార్టీల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇల్లందును మానుకోట జిల్లాలో కలపాలనేది అందరికీ ఆమోదంగానే ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement