అమరవీరులను స్మరించుకోవడం బాధ్యత
నెల్లూరు(బారకాసు): అడవుల సంరక్షణలో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగాలు చేసిన అటవీ అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యతని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) రీజినల్ మేనేజర్ శ్రీనివాసశాస్త్రి పేర్కొన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అటవీ కార్యాలయంలో అమర వీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అటవీ సంరక్షణలో సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడవులను కాపాడుతూ 14 మంది అటవీ సిబ్బంది తమ ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. ఎఫ్డీసీ డీఎం రామకృష్ణ, నెల్లూరు రేంజర్ శ్రీకాంత్‌రెడ్డి, తెలుగుగంగ ఫారెస్ట్ రేంజర్లు అల్లాభక్షు, శ్రీదేవి, మారుతీప్రసాద్, డీఎఫ్‌ఓ కార్యాలయ సిబ్బంది రమేష్, సురేష్, హరికుమార్, తదితరులు పాల్గొన్నారు.