అసెంబ్లీ సాక్షిగా రైతు ఆత్మహత్యాయత్నం
- సెల్‌టవర్ ఎక్కి పురుగుల మందు తాగే యత్నం
- శాసనసభ జరుగుతున్న సమయంలోనే ఘటన
హైదరాబాద్: రైతు బలవన్మరణాలపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలోనే శాసనసభకు సమీపంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు! సెల్‌టవర్ ఎక్కి కొద్ది మోతాదులో పురుగుల మందు తాగాడు. పోలీ సులు నానా హైరానా పడి అతడిని కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శాసనసభకు కొద్ది దూరంలోనే మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటన సంచలనం సృష్టించింది.
అప్పుల బాధలకు తాళలేక..
వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన యువరైతు సమ్మయ్య(35) ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాడు. ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నాడు. కానీ ఈసారి వర్షాభావంతో పంటలు పండలేదు. రూ.రెండు లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఆర్థికసాయం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు పది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ అపాయింట్‌మెంట్ లభించలేదు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసేం దుకు యత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు.
దీంతో మంగళవారం పురుగుల మందు డబ్బా పట్టుకొని అసెంబ్లీకి సమీపంలోని సెల్‌టవర్ ఎక్కి కొద్దిగా పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. మధ్యాహ్నం 1.45 నుంచి 2.30 వరకు సమ్మయ్య టవర్‌పైనే ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరికి అప్పు తీరేందుకు మార్గం చూపుతామని హామీ ఇవ్వడంతో అతడు కిందకు దిగాడు. అనంతరం పోలీసులు సమ్మయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం చేయించి, ఇంటికి పంపించారు.
ఉద్యోగం వస్తుందనుకున్నా..
ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఉద్యోగం వస్తుందని అనుకున్నానని, అయితే ఆశలన్నీ అడియాసలయ్యాయని సమ్మయ్య విలేకరులకు చెప్పాడు. ‘‘తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం 150కి పైగా పాటలు రాశాను. రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని ఆశించిన. ఎంతోమంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం.. నన్ను విస్మరించింది. ఆశలన్నీ అడియాసలయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ఏదో ఒకరోజు ఉద్యోగం వస్తుందనుకున్నా. అప్పులు తీర్చుకోవచ్చనుకున్నా. కానీ అలాంటి అవకాశాలు కనిపించలేదు. ఈ ఏడాది వానలు పడ లేదు. పంట చేతికందలేదు. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వంపై ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి బాధలు చెప్పుకోవాలనుకున్నా. కానీ ఆ అవకాశం కూడా దొరకలేదు. అసెంబ్లీకి వచ్చిన మంత్రులను కలసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యే శరణ్యమనుకున్నా..’’ అని సమ్మయ్య చెప్పాడు.