sammaiah
-
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకం, సశాస్త్రీయం. రాజకీయ కారణాల వల్ల రాజధానుల నిర్మాణం ‘మూరెడు ముందుకు, బారెడు వెనుక’కు చందంగా సాగుతోంది. అయినా ఎప్పటికైనా విభిన్న భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక కారణాల రీత్యా మూడు పరిపాలనా కేంద్రాల ఏర్పాటు కావలసిందే. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర ప్రాంతాల మధ్య అభివృద్ధి, యాస, భాషల్లో ఎప్పటి నుంచో తేడాలు ఉన్నాయి. ఇందుకు భౌగోళికపరమైన వాతావరణం, నేలల స్వభావం, సముద్ర తీరం వంటివి కూడా కారణాలే. కారణాలు ఏవైనా మధ్యాంధ్ర జిల్లాలైన ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆర్థికంగా మిగతా ప్రాంతాల కంటే బాగా అభివృద్ధి చెందాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమలు ఇప్పటికీ వెనక బడే ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయడానికే పరిపాలనను వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీలో జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. శాసన రాజధానిగా ఇప్పటికే మధ్యాంధ్రలో ఉన్న అమరావతిని కొనసాగించాలనీ, న్యాయరాజధానిగా కర్నూలును చేసి, అందులో హైకోర్టును ఏర్పాటు చేయాలనీ; రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధానిని దగ్గర చేయాలనీ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు. ఇప్పటికే దేశంలో పాలనా వికేంద్రీకరణను పాటిస్తున్న రాష్ట్రాలు పది దాకా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ రాయ్‌పూర్‌లో ఉంటే... హైకోర్టు బిలాస్పూర్లో పనిచేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ, పరిపాలన విభాగం గాంధీనగర్‌లో ఉంటే, హైకోర్టు అహ్మదాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. కేరళకు సంబంధించి తిరువనంతపురంలో సెక్రటేరియేట్, అసెంబ్లీ ఉంటే... కొచ్చిలో హైకోర్టు పని చేస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో, అసెంబ్లీ, సచివాలయం ఉన్నాయి. జబల్పూర్లో హైకోర్టు నడుస్తోంది. మహారాష్ట్రలో సమ్మర్ క్యాపిటల్ ముంబై, వింటర్ క్యాపిటల్ నాగ్‌పూర్‌లో ఉంటాయి. ఇక ఒడిశాలోని భువనేశ్వర్‌లో పరిపాలన విభాగం ఉంటే కటక్‌లో హైకోర్టు ఫంక్షన్లో ఉంది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో ఉంటే... పరిపాలన విభాగం జోధ్‌పూర్‌లో హైకోర్టు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పరిపాలన, అసెంబ్లీ విభాగాలు ఉంటే... అలహాబాద్‌లో హైకోర్టు పనిచేస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో అసెంబ్లీ, సెక్రటేరియేట్ ఉన్నాయి. నైనిటాల్లో హైకోర్టు ఉంది. (క్లిక్: ఇది ఉత్తరాంధ్ర మనోభావాలపై దండయాత్ర!) ఏపీలో నెలకొన్న భిన్న భూభౌతిక పరి స్థితులు, వాతావరణ పరిస్థితులు, సాంస్కృతిక వైరుధ్యం, ఆహారం, ఆహార్యం, ఆర్థిక అసమానతల రీత్యా రాజధాని విస్తరణ సహే తుకమే. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఏళ్లుగా పేరుకు పోయిన భిన్న వైరుధ్యాలను రూపుమాపే కార్యక్రమాలు రూపొందించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే నేటికీ ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక కళింగసీమ ఉద్యమ నినాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ప్రజల మధ్య ఏకరీతి మానసిక స్థితి, ఏకాత్మతాభావం, సోదర భావం పెంపొం దించే కార్యాచరణ అమలు చేయాలి. అనేక మతాలు, భాషలు, జాతులు, సంస్కృతులు, భూభౌతిక వైవిధ్యాలతో కూడిన భారత దేశాన్ని ఒకే జాతిగా పెనవేయడానికి ప్రజల మధ్య సోదరభావం సృష్టించే వరకు వికేంద్రీకరణ మాత్రమే తారక మంత్రం! (క్లిక్: అమరావతి నిర్మాణం ఎలా సాధ్యమో మీరే చెప్పండి!) - కౌడె సమ్మయ్య, జర్నలిస్టు -
‘రంగు’ మారుతోంది..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: రాజకీయ వలసలు నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నాలుగున్నరేళ్లు అప్రతిహతంగా కొనసాగిన గులాబీ హవాకు సొంత పార్టీలోని కొందరు నాయకులే గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్టు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు భవిష్యత్ రాజకీయాలను అంచనా వేస్తూ మరికొందరు నాయకులు టీఆర్ఎస్కు దూరమవుతున్నారు. టీఆర్ఎస్కు చెందిన రాష్ట్రస్థాయిలో పేరున్న నేతలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లలో కొందరు ఇప్పటికే పార్టీకి దూరం కాగా, మరికొందరు లోపాయికారిగా సహాయ నిరాకరణ కార్యక్రమంలో మునిగిపోయారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకే ఎక్కువ మంది నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నాలుగున్నరేళ్లు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను శాసించిన నేతలు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఎదురైంది. ఢిల్లీ కాంగ్రెస్ అగ్రనేతల వద్దకు వినోద్ మాజీ మంత్రి గడ్డం వినోద్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు వినోద్ మంగళవారం ఢిల్లీకి వెళ్లినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దసరా లోపు కాంగ్రెస్ పార్టీలో చేరి, ఈనెల 20వ తేదీన భైంసాలో జరిగే రాహుల్ సభ నుంచి క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం. టీఆర్ఎస్ అగ్రస్థాయి నేతలు కూడా వినోద్ విషయంలో మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకే చెందిన కొందరు అగ్రనేతలు వినోద్ సోదరుల విషయంలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల సీనియర్ నేత వి.హనుమంతరావు వినోద్‌ను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని, పార్టీ టికెట్టు ఇవ్వవద్దని బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయితే స్థానికంగా మాత్రం కాంగ్రెస్‌లో చేరాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వినోద్‌కు అండగా ఉన్న జెడ్పీ వైఎస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కూడా ఆయన వెంటనే కాంగ్రెస్‌లో చేరే యోచనలో ఉన్నారు. ఐకే రెడ్డికి అప్పాల గణేష్ షాక్ నిర్మల్ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన చేతిలో ఓడిపోయిన శ్రీహరిరావును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మచ్చిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఊహించని రీతిలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కౌన్సిల్‌లోని 21 మంది కౌన్సిలర్లతో కలిసి టీఆర్ఎస్కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఐకే రెడ్డి విజయానికి గణేష్ కృషి చేశారు. ఇక్కడ ఎంఐఎంకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. అయితే గణేష్ చక్రవర్తి టీఆర్ఎస్ను వీడినప్పటికీ, ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. 20వ తేదీన భైంసా మీటింగ్‌లో రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం. ముథోల్‌లో వేణుగోపాలచారి వర్గం చిచ్చు ముథోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్‌రెడ్డిని మార్చాలని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి వర్గం డిమాండ్ చేస్తోంది. విఠల్‌రెడ్డిని మార్చాలని గాంధీజీ విగ్రహానికి ఇప్పటికే రెండుసార్లు వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. విఠల్‌రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేయాలని స్వయంగా కేటీఆర్ సూచించినా చారి వర్గీయులు ససేమిరా అంటున్నారు. అయితే కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వేణుగోపాలచారి ఇప్పటివరకు నోరు విప్పలేదు. వేణుగోపాలచారిని సైతం కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. సిర్పూరులో సమ్మయ్య షాక్... సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేయడం పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పకు మింగుడుపడడం లేదు. సమ్మయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని గతంలోనే ప్రయత్నించిన నాయకులు రాహుల్‌గాంధీ సభలో ఆయనను పార్టీ మారేలా చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అలాగే ఈ నియోజకవర్గంలో దహెగాం మాజీ జెడ్పీటీసీ చిలువేరు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చిలువేరు కల్పన, మాజీ సర్పంచ్ జయప్రద కాంగ్రెస్‌లో చేరారు. ఇదే మండలానికి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో చేరారు. పెంచికల్‌పేట, బెజ్జూరులో కూడా ఇదేరీతిన వలసలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పరంపర కొనసాగుతోంది. బోథ్‌లో కలిసిరాని ఎంపీ నగేష్ బోథ్ నియోజకవర్గంలో టికెట్టు మార్చాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ పట్టుపడుతున్నారు. పార్టీ అభ్యర్థి రాథోడ్ బాపూరావుకు నగేష్ వర్గం సహాయ నిరాకరణ కొనసాగిస్తోంది. ప్రచారంలోకి వెళ్లకపోగా, బాపూరావు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నగేష్ ప్రచారానికి వెళ్లకుంటే ఇక్కడ బాపూరావుకు కష్టమని ఆపార్టీ కార్యకర్తలు చెపుతున్నారు. మంచిర్యాలలోనూ.. మంచిర్యాలలో ఎంపీపీ బేర సత్యనారాయణ టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీఎస్పీ నుంచి పోటీ చేస్తుండగా, ఇక్కడ టికెట్టు ఆశించి భంగపడ్డ పుస్కూరి రామ్మోహన్రావు అభ్యర్థి దివాకర్‌రావు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ వసుంధర, ఆమె భర్త రమేష్, పలువురు కౌన్సిలర్లు కూడా సహాయ నిరాకరణ కార్యక్రమంలో ఉన్నట్లు సమాచారం. -
జనగాం జిల్లా కోసం సెల్‌టవరెక్కి ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో జనగాంను కూడా చేర్చాలనే డిమాండ్లు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని సెల్‌టవర్‌పైకి గురువారం ఉదయం ఐదుగురు యువకులు ఎక్కి నిరసన తెలిపారు. తమ వెంట పెట్రోల్ బాటిళ్లను కూడా తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే జనగాం జిల్లాను ప్రకటించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. టవరెక్కిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, యువజన కాంగ్రెస్ నేత గోవర్థన్ ఉన్నారు. -
పక్కాప్లాన్‌తో కడతేర్చారు
కేతిరి రమేష్‌ను హత్య చేసిన సమ్మయ్య, ప్రకాష్ అరెస్ట్ కుటుంబ సభ్యురాలిని వేధించడమే కారణం గొడ్డలితో హతమార్చి, మృతదేహాన్ని చెరువులో పడేసిన వైనం ఏటూరునాగారం : మండలంలోని తాళ్లగడ్డకు చెందిన కేతిరి రమేష్(20) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ అఘారుుత్యానికి పాల్పడిన కేతిరి సమ్మయ్య, కేతిరి ప్రకాష్‌లను మంగళవారం ఏటూరునాగారంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు చూపించారు. ఈసందర్భంగా సీఐ దురిశెట్టి రఘుచందర్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 17న కేతిరి రమేష్‌పై తండ్రీకొడుకులు కేతిరి సమ్మయ్య, కేతిరి ప్రకాష్‌లు కలిసి గొడ్డలితో దాడిచేసి హత్య చేశారు. మృతుడు రమేష్‌కు సమ్మయ్య కోడలు వరుసకు వదిన అవుతుంది. తన కోడలిని కేతిరి రమేష్ తరుచూ వేధిస్తున్నాడని భావించి తీవ్ర అసహనానికి గురైన సమ్మయ్య, తన కుమారుడు ప్రకాష్‌తో కలిసి రమేష్‌ను కడతేర్చేందుకు రెండు నెలల క్రితం పథక రచన చేశాడు. 17న గణేష్‌కుంట చెరువుగట్టు వద్ద కనిపించిన రమేష్‌ను తమ ఇంటికి తీసుకెళ్లారు. కాళ్లు, చేతులు కట్టేసి ఇష్టానుసారంగా చితకబాదారు. ఈక్రమంలో గొడ్డలి వెనుకకు తిప్పి తలపై బలంగా మోదడంతో రమేష్ మృతిచెందాడు. అనంతరం వారిద్దరూ కలిసి సమీపంలోని గణేష్‌కుంట చెరువులో మృతదేహాన్ని పడేశారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, ఒంటిపై రక్తపు మరకలు పడిన దుస్తులను ఇంట్లోని బాత్రూం పక్కన దాచిపెట్టారు. మృతుడు రమేష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సమ్మయ్య, ప్రకాష్‌లను అదుపులోకి తీసుకొని విచారించడంతో రమేష్‌ను హత్య చేసింది తామేనని అంగీకరించారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై నరేష్, హెడ్ కానిస్టేబుల్ మహిపాల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు హరికృష్ణ, రాజు ఉన్నారు. -
పిడుగు పాటుకు ముగ్గురి మృతి
తెలంగాణలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం మరో ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని అక్కన్నపేటలో పిడుగుపాటు గురై ఓ రైతు మృతి చెందాడు. అక్కన్నపేట గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య పొలంలో పనులు చేస్తుండా ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్ద శబ్ధంతో పిడుగు పొలంలో ఉన్న రైతుపై పడింది. ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో గంధగూడకు చెందిన తలారి చంద్రయ్య తన పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి చనిపోయాడు.అలాగే రాజేంద్రనగర్ మండలంలోని భైరాగిగూడలో పాండు అని వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో పిడుగు పాటుకు గురై మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు. -
గోదావరిఖనిలో వడదెబ్బకు వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో కొలిపాక సమ్మయ్య(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతిచెందాడు. బట్టలు ఉతికేందుకు చాకిరేవుకు వెళ్లిన సమ్మయ్య ఎండవేడిమికి తట్టుకోలేక క్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
కోల్‌సిటీ: కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఇంక్లయిన్ గనిలో ఎలక్ట్రిషియన్ హెల్పర్‌గా పని చేస్తున్న సమ్మయ్య (50) బుధవారం తెల్లవారుజామున ఇంటి వెనుక స్లాబ్‌కు ఉరేసుకుని ఉండగా స్తానికులు గుర్తించారు. మతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సమ్మయ్య కొంత కాలంగా మద్యానికి బానిస కాగా, కడుపునొప్పి, నడుమునొప్పి వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
బావిలో పడి వ్యక్తి మృతి
ఎల్కతుర్తి: వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నథపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆరెపల్లి సమ్మయ్య(55) ఈ రోజు బావి వద్ద పని చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఇది గుర్తించిన తోటి రైతులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అసెంబ్లీ సాక్షిగా రైతు ఆత్మహత్యాయత్నం
- సెల్‌టవర్ ఎక్కి పురుగుల మందు తాగే యత్నం - శాసనసభ జరుగుతున్న సమయంలోనే ఘటన హైదరాబాద్: రైతు బలవన్మరణాలపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలోనే శాసనసభకు సమీపంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు! సెల్‌టవర్ ఎక్కి కొద్ది మోతాదులో పురుగుల మందు తాగాడు. పోలీ సులు నానా హైరానా పడి అతడిని కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శాసనసభకు కొద్ది దూరంలోనే మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అప్పుల బాధలకు తాళలేక.. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన యువరైతు సమ్మయ్య(35) ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాడు. ఎలాంటి ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నాడు. కానీ ఈసారి వర్షాభావంతో పంటలు పండలేదు. రూ.రెండు లక్షలకు పైగా అప్పులయ్యాయి. ఆర్థికసాయం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు పది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ అపాయింట్మెంట్ లభించలేదు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసేం దుకు యత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో మంగళవారం పురుగుల మందు డబ్బా పట్టుకొని అసెంబ్లీకి సమీపంలోని సెల్‌టవర్ ఎక్కి కొద్దిగా పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని కిందకు దించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. మధ్యాహ్నం 1.45 నుంచి 2.30 వరకు సమ్మయ్య టవర్‌పైనే ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరికి అప్పు తీరేందుకు మార్గం చూపుతామని హామీ ఇవ్వడంతో అతడు కిందకు దిగాడు. అనంతరం పోలీసులు సమ్మయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యం చేయించి, ఇంటికి పంపించారు. ఉద్యోగం వస్తుందనుకున్నా.. ప్రత్యేక రాష్ట్రంలోనైనా ఉద్యోగం వస్తుందని అనుకున్నానని, అయితే ఆశలన్నీ అడియాసలయ్యాయని సమ్మయ్య విలేకరులకు చెప్పాడు. ‘‘తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం 150కి పైగా పాటలు రాశాను. రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుందని ఆశించిన. ఎంతోమంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం.. నన్ను విస్మరించింది. ఆశలన్నీ అడియాసలయ్యాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ఏదో ఒకరోజు ఉద్యోగం వస్తుందనుకున్నా. అప్పులు తీర్చుకోవచ్చనుకున్నా. కానీ అలాంటి అవకాశాలు కనిపించలేదు. ఈ ఏడాది వానలు పడ లేదు. పంట చేతికందలేదు. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వంపై ఆశలు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి బాధలు చెప్పుకోవాలనుకున్నా. కానీ ఆ అవకాశం కూడా దొరకలేదు. అసెంబ్లీకి వచ్చిన మంత్రులను కలసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యే శరణ్యమనుకున్నా..’’ అని సమ్మయ్య చెప్పాడు. -
పొలంలో ట్రాక్టర్ బోల్తా.. ఒకరి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాలలో బుధవారం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో యజమాని భారతపు సమ్మయ్య (32) అక్కడిక్కడే మృతిచెందాడు. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన సమ్మయ్య రోజూ మాదిరిగానే బుధవారం సముద్రాలలోని సొంత పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకెళ్లాడు. అక్కడ కేజీవీల్స్ బిగించి దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ బురదలో దిగబడింది. ఈ క్రమంలో ఎక్స్‌లేటర్‌ను ఒక్కసారిగా తొక్కడంతో ట్రాక్టర్ ఇంజన్ లేచి బోల్తా పడింది. దానికిందనే ఇరుక్కుపోయిన సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య స్వర్ణలత, తొమ్మిదిరోజుల కూతురు ఉంది.