కేతిరి రమేష్‌ను హత్య చేసిన సమ్మయ్య, ప్రకాష్ అరెస్ట్
కుటుంబ సభ్యురాలిని వేధించడమే కారణం
గొడ్డలితో హతమార్చి, మృతదేహాన్ని చెరువులో పడేసిన వైనం
ఏటూరునాగారం : మండలంలోని తాళ్లగడ్డకు చెందిన కేతిరి రమేష్(20) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ అఘారుుత్యానికి పాల్పడిన కేతిరి సమ్మయ్య, కేతిరి ప్రకాష్‌లను మంగళవారం ఏటూరునాగారంలోని సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు చూపించారు. ఈసందర్భంగా సీఐ దురిశెట్టి రఘుచందర్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 17న కేతిరి రమేష్‌పై తండ్రీకొడుకులు కేతిరి సమ్మయ్య, కేతిరి ప్రకాష్‌లు కలిసి గొడ్డలితో దాడిచేసి హత్య చేశారు.
మృతుడు రమేష్‌కు సమ్మయ్య కోడలు వరుసకు వదిన అవుతుంది. తన కోడలిని కేతిరి రమేష్ తరుచూ వేధిస్తున్నాడని భావించి తీవ్ర అసహనానికి గురైన సమ్మయ్య, తన కుమారుడు ప్రకాష్‌తో కలిసి రమేష్‌ను కడతేర్చేందుకు రెండు నెలల క్రితం పథక రచన చేశాడు. 17న గణేష్‌కుంట చెరువుగట్టు వద్ద కనిపించిన రమేష్‌ను తమ ఇంటికి తీసుకెళ్లారు. కాళ్లు, చేతులు కట్టేసి ఇష్టానుసారంగా చితకబాదారు. ఈక్రమంలో గొడ్డలి వెనుకకు తిప్పి తలపై బలంగా మోదడంతో రమేష్ మృతిచెందాడు. అనంతరం వారిద్దరూ కలిసి సమీపంలోని గణేష్‌కుంట చెరువులో మృతదేహాన్ని పడేశారు.
హత్యకు ఉపయోగించిన గొడ్డలి, ఒంటిపై రక్తపు మరకలు పడిన దుస్తులను ఇంట్లోని బాత్‌రూం పక్కన దాచిపెట్టారు. మృతుడు రమేష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సమ్మయ్య, ప్రకాష్‌లను అదుపులోకి తీసుకొని విచారించడంతో రమేష్‌ను హత్య చేసింది తామేనని అంగీకరించారు. వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట ఎస్సై నరేష్, హెడ్ కానిస్టేబుల్ మహిపాల్‌రెడ్డి, కానిస్టేబుళ్లు హరికృష్ణ, రాజు ఉన్నారు.