ఎంపీ రమేష్
సాక్షి, చెన్నై : కడలూరు ఎంపీ, డీఎంకే నేత రమేష్ ఓ హత్య కేసులో బుక్కయ్యారు. ఆయనపై శనివారం సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కడలూరు నుంచి డీఎంకే అభ్యర్థిగా టీఆర్‌వీఎస్ రమేష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆయనకు కడలూరులో జీడిపప్పు పరిశ్రమ ఉంది. ఇక్కడ మేల్ వా పట్టు గ్రామానికి చెందిన గోవిందరాజన్ పనిచేస్తున్నాడు. ఈయన పీఎంకేలో కార్యకర్త. ఈ పరిస్థితుల్లో గత నెల గోవిందరాజన్ మృతి చెందాడు. అయితే, ఆయన శరీరంపై గాయాలు ఉండడం అనుమానాలకు దారితీసింది. హత్యకేసు నమోదు చేయాలంటూ.. కిడంబలూరు పోలీసులను బాధిత కుటుంబం కోరింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జిప్మర్ వైద్య బృందం పర్యవేక్షణలో గోవిందరాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ కుటుంబం పట్టుబట్టింది.
చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..)
సీబీసీఐడీ కేసు నమోదు
ఈ కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ రమేష్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆయనే కొట్టి చంపినట్లుగా, బలవంతంగా విషం తాగించినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన సీబీసీఐడీ శనివారం ఎంపీపై హత్య కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చై, సుందర్, వినోద్ పేర్లను కూడా కేసులో చేర్చారు. నటరాజన్ అనారోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరడంతో మిగిలిన నలుగుర్ని సీబీసీఐడీ అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వీరిని కడలూరు జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో ఎంపీ రమేష్‌ను అరెస్టు చేయడానికి సీబీసీఐడీ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గోవిందరాజన్ పరిశ్రమలో చోరికి పాల్పడినట్లు, ఆగ్రహించి ఆయన్ని చితక్కొట్టి హతమార్చినట్లుగా సీబీసీఐడీ గుర్తించినట్లు సంకేతాలు వెలువడ్డాయి.
చదవండి: (ఆశిష్ మిశ్రా అరెస్ట్)
ముఖ్యనేతలతో స్టాలిన్ సమాలోచన
పార్టీకి చెందిన ఎంపీపై సీబీసీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కడలూరు జిల్లా ముఖ్య నేతలు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో అన్నాఅరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, న్యాయవిభాగం నేతలు, రాజ్యసభ సభ్యుడు విల్సన్, ఎన్.ఆర్ ఇలంగోవన్, మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం ఈ సమావేశానికి హాజరయ్యారు. సీబీసీఐడీ నుంచి లభించే సమాచారం మేరకు పార్టీ పరంగా రమేష్‌పై చర్యలకు డీఎంకే సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment