‘రంగు’ మారుతోంది..! | Gaddam Vinod Join In Congress Adilabad | Sakshi
Sakshi News home page

‘రంగు’ మారుతోంది..!

Published Wed, Oct 17 2018 7:37 AM | Last Updated on Wed, Oct 17 2018 7:37 AM

Gaddam Vinod Join In Congress  Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: రాజకీయ వలసలు నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నాలుగున్నరేళ్లు అప్రతిహతంగా కొనసాగిన గులాబీ హవాకు సొంత పార్టీలోని కొందరు నాయకులే గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్టు ఆశించి భంగపడ్డ నేతలతో పాటు భవిష్యత్‌ రాజకీయాలను అంచనా వేస్తూ మరికొందరు నాయకులు టీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన రాష్ట్రస్థాయిలో పేరున్న నేతలు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లలో కొందరు ఇప్పటికే పార్టీకి దూరం కాగా, మరికొందరు లోపాయికారిగా సహాయ నిరాకరణ కార్యక్రమంలో మునిగిపోయారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకే ఎక్కువ మంది నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నాలుగున్నరేళ్లు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాను శాసించిన నేతలు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఎదురైంది.
 
ఢిల్లీ కాంగ్రెస్‌ అగ్రనేతల వద్దకు వినోద్‌ 
మాజీ మంత్రి గడ్డం వినోద్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు వినోద్‌ మంగళవారం ఢిల్లీకి వెళ్లినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. దసరా లోపు కాంగ్రెస్‌ పార్టీలో చేరి, ఈనెల 20వ తేదీన భైంసాలో జరిగే రాహుల్‌ సభ నుంచి క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌ అగ్రస్థాయి నేతలు కూడా వినోద్‌ విషయంలో మౌనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీకే చెందిన కొందరు అగ్రనేతలు వినోద్‌ సోదరుల విషయంలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల సీనియర్‌ నేత వి.హనుమంతరావు వినోద్‌ను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవద్దని, పార్టీ టికెట్టు ఇవ్వవద్దని బాహాటంగానే వ్యాఖ్యానించారు. అయితే స్థానికంగా మాత్రం కాంగ్రెస్‌లో చేరాలనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వినోద్‌కు అండగా ఉన్న జెడ్పీ వైఎస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి కూడా ఆయన వెంటనే కాంగ్రెస్‌లో చేరే  యోచనలో ఉన్నారు.
 
ఐకే రెడ్డికి అప్పాల గణేష్‌ షాక్‌

నిర్మల్‌ నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన చేతిలో ఓడిపోయిన శ్రీహరిరావును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మచ్చిక చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. అయితే ఊహించని రీతిలో మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి కౌన్సిల్‌లోని 21 మంది కౌన్సిలర్లతో కలిసి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఐకే రెడ్డి విజయానికి గణేష్‌ కృషి చేశారు. ఇక్కడ ఎంఐఎంకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. అయితే గణేష్‌ చక్రవర్తి టీఆర్‌ఎస్‌ను వీడినప్పటికీ, ఇంకా కాంగ్రెస్‌లో చేరలేదు. 20వ తేదీన భైంసా మీటింగ్‌లో రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఆయన కాంగ్రెస్‌ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం.

ముథోల్‌లో వేణుగోపాలచారి వర్గం చిచ్చు
ముథోల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డిని మార్చాలని మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి వర్గం డిమాండ్‌ చేస్తోంది. విఠల్‌రెడ్డిని మార్చాలని గాంధీజీ విగ్రహానికి ఇప్పటికే రెండుసార్లు వినతిపత్రాలు ఇవ్వడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. విఠల్‌రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేయాలని స్వయంగా కేటీఆర్‌ సూచించినా చారి వర్గీయులు ససేమిరా అంటున్నారు. అయితే కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలున్న వేణుగోపాలచారి ఇప్పటివరకు నోరు విప్పలేదు. వేణుగోపాలచారిని సైతం కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


సిర్పూరులో సమ్మయ్య షాక్‌... 
సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేశారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేయడం పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పకు మింగుడుపడడం లేదు. సమ్మయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని గతంలోనే ప్రయత్నించిన నాయకులు రాహుల్‌గాంధీ సభలో ఆయనను పార్టీ మారేలా చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

అలాగే ఈ నియోజకవర్గంలో దహెగాం మాజీ జెడ్పీటీసీ చిలువేరు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చిలువేరు కల్పన, మాజీ సర్పంచ్‌ జయప్రద కాంగ్రెస్‌లో చేరారు. ఇదే మండలానికి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్‌లో చేరారు. పెంచికల్‌పేట, బెజ్జూరులో కూడా ఇదేరీతిన వలసలు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కూడా టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పరంపర కొనసాగుతోంది.

బోథ్‌లో కలిసిరాని ఎంపీ నగేష్‌
బోథ్‌ నియోజకవర్గంలో టికెట్టు మార్చాలని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేష్‌ పట్టుపడుతున్నారు. పార్టీ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావుకు నగేష్‌ వర్గం సహాయ నిరాకరణ కొనసాగిస్తోంది. ప్రచారంలోకి వెళ్లకపోగా, బాపూరావు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నగేష్‌ ప్రచారానికి వెళ్లకుంటే ఇక్కడ బాపూరావుకు కష్టమని ఆపార్టీ కార్యకర్తలు చెపుతున్నారు. 

మంచిర్యాలలోనూ.. 
మంచిర్యాలలో ఎంపీపీ బేర సత్యనారాయణ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీఎస్పీ నుంచి పోటీ చేస్తుండగా, ఇక్కడ టికెట్టు ఆశించి భంగపడ్డ పుస్కూరి రామ్మోహన్‌రావు అభ్యర్థి దివాకర్‌రావు వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ వసుంధర, ఆమె భర్త రమేష్, పలువురు కౌన్సిలర్లు కూడా సహాయ నిరాకరణ కార్యక్రమంలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement