మందమర్రి (ఆదిలాబాద్) : దళితులను తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న సీఎం కేసీఆర్ ఆ హామీని విస్మరించారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత జి.వివేక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఆదివారం ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగరేణి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రథమ మహాసభలలో పాల్గొన్న సందర్భంగా వివేక్ మాట్లాడారు. కుటుంబ పాలనే తప్ప ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు పట్టవన్నారు.
ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఫ్యాక్టరీలను మూసి ఉన్న ఉద్యోగాలు ఊడబెరుకుతున్నారని ఆరోపించారు. కాగా నాయకుడి కంటే కార్మికుడే తెలివైనవాడని ఐఎన్‌టీయూసీ అఖిల భారత అధ్యక్షుడు సంజీవరెడ్డి అన్నారు. కార్మికుడి కష్టాలు తీర్చకుండా ఓటు అడిగే హక్కు ఏ నాయకుడికీ లేదన్నారు. ఐఎన్‌టీయూసీ ఎప్పుడూ కాంగ్రెస్‌కు అనుబంధంగానే కొనసాగుతుందని చెప్పారు.