క్షుద్రపూజలకు ఆరడుగుల మహిళ
పోలీసుల అదుపులో డబ్బు ఎర చూపిన నలుగురు నిందితులు
బోనకల్ : క్షుద్ర పూజలకోసం ఓ మహిళకు డబ్బులు ఎరచూపి తీసుకువెళ్లే ప్రయత్నంచేసిన వ్యక్తులను బోనకల్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. క్షుద్ర పూజల కోసం ఆరు అడుగుల ఎత్తుఉన్న మహిళ కావాలని చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన ఓర్స్ బాలకృష్ణ బోనకల్‌కు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా సైదాకు తెలిపాడు. బోనకల్ కస్తూర్బా పాఠశాలలో వంటమనిషి వద్ద హెల్పర్‌గా పనిచేస్తున్న శ్యామల రేణుక ఆరు అడుగులు ఉంటుందని చెప్పడంతో..కృష్ణాజిల్లా వత్సవాయి మండలం చిట్యాలకు చెందిన పెరుగు వెంకటరమణ, కొణిజర్ల మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన పుట్టా లక్ష్మిలతో కలిసి ఓర్స్ బాలకృష్ణ శ్యామల రేణుక వద్దకు వచ్చి..పూజకు రావాలని, అలా చేస్తే రూ.2లక్షలు ఇస్తామని, భయమనిపిస్తే భర్తతో కలిసి రావొచ్చని నమ్మబలికారు.
దీంతో రేణుకకు అనుమానం వచ్చి కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్‌కు విషయాన్ని వివరించగా..ఆమె బోనకల్ ఎస్సై కుమారస్వామికి విషయం తెలిపారు. ఆయన సిబ్బందితో కలిసి రేణుక ఇంట్లో ఉన్న పెరుగు వెంకటరమణ, పుట్టా లక్ష్మి, భూక్యా సైదా, ఓర్స్ బాలకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారులకోసం విచారణ నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.