పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృతి | Four youth drowned in Amaravati | Sakshi
Sakshi News home page

పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృతి

Published Tue, Aug 16 2016 3:58 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM

పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృతి - Sakshi

పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృతి

కృష్ణానదిలో ఇసుక గుంతల్లో పడడంతో ఘటన
డ్రెడ్జర్‌తో తీసిన ఇసుక గుంతలే
ఐదుగురు యువకుల ప్రాణాలను బలికొన్న వైనం
లోతు ఎక్కువగా ఉండటంతో కాపాడలేకపోయాం.. గజ ఈతగాళ్లు


అమరావతి: పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదురుగు యువకులను అనధికారికంగా తీసిన ఇసుక గోతులు పొట్టన పెట్టుకొన్నాయి. కృష్ణాజిల్లా నందిగామ చైతన్య డిగ్రీ కాలేజిలో బికాం ఫైనల్‌ఇయర్ చదువుతున్న 11 మంది విద్యార్థులు పుష్కర స్నానాలకని చందర్లపాడు మండలం ఏటూరు రేవు ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ఇసుక ర్యాంపు ప్రాంతాల్లో స్నానం చేద్దామని మంగళవారం ఉదయం 11గంటలకు వెళ్లారు. నదిలో నీళ్లు మాములుగా ఉన్నాయనుకుని ఒక విద్యార్థి దిగగా...డ్రెడ్జర్‌తో తోడిన సుమారు 30నుంచి 35 అడుగుల లోతులో ఉన్న నీటి గుంటలో జారి పడిపోయాడు.

స్నేహితున్ని కాపాడేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు. పాశం గోపిరెడ్డి, నందిగామ నగేష్, కంచిచర్ల లోకేష్ సాయి హరగోపాల్, కుమ్మవరపు హరిగోపి, ములకపల్లె హరీష్ ఐదుగురూ ఒకరినొకరు పట్టుకొని ఒడ్డుకు చేరుకొనే ప్రయత్నం చేశారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో అంతా నదిలో మునిగి చనిపోయారు. చేతులు ఊపుతూ కాపాడండి అంటూ వారు చేసిన అర్తనాదాలు విని పరుగెత్తుకుంటూ వచ్చిన స్నేహితుడు వంశీ రక్షించే ప్రయత్నం చేయగా..అతని కాళ్లను ఇద్దరు పట్టుకోవడంతో ఎలాగోలా వారిని వదిలివేసి ఒడ్డుకు చేరాడు. అక్కడే ఉన్న గజ ఈతగాళ్లకు చెప్పి, స్నేహితుల ప్రాణాలు కాపాడాలని వేడుకొన్నాడు.


15 మందిగల గజ ఈతగాళ్ల బృందం యువకులు గల్లంతు అయిన ప్రదేశానికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేసింది. ఇసుకను భారీ వాహనాలతో తీయడంతో అక్కడ 30 అడుగులమేర నీటి లోతు ఉండటంతో వారు చెతులెత్తేసి కాపాడలేమంటూ వెనుదిరిగారు. ఒడ్డున ఉన్న స్నేహితులు ఫోన్‌లు చేయడంతో తర్వాత మరికొందరు గజ ఈతగాళ్లు వచ్చి గాలించి ఐదుగురు యువకుల శవాలను వెలికితీశారు. సంఘటన స్థలానికి పోలీసులు హూటా హుటిన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నందిగామ నుంచి ఇలా వెళ్లారు
11 మంది విద్యార్థులు నాలుగు బైకుల్లో కాలేజీ నుంచి ఇంటర్ వెల్ మధ్యలో పుష్కర స్నానాలకు వచ్చినట్లు తెలిపారు. ఏటూరు రేవులో నీళ్లు శుభ్రంగా ఉన్నాయని, అక్కడ అన్నదానం చేస్తున్నారని తెలియడంతో స్నానం చేసి సరదాగా గడిపి వెళ్లామని వచ్చామని స్నేహితులు తెలిపారు. అయితే కంచికర్ల లోకేష్ తండ్రి పులి శ్రీను వాసులు అన్నదానం వద్ద ఉండటంతో నాన్న అరుస్తాడు, వద్దు అని లోకేష్ వారించడంతో చనిపోయిన ఐదుగురు అన్నదానం వద్దకు పోకుండా అక్కడే అగిపోయారు. పులిహోర కోసం వెళ్లిన గువ్వల కార్తీక్, నాదెండ్ల మనోజ్‌కుమార్‌రెడ్డి, రెడ్డి దేవి వరప్రాపాద్, బొడేపూడి వంశి, కూసుగోపి, గద్దె వంశీలు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

నాయనా...ఎంత జరిగింది:  లోకేష్ తండ్రి పులి శ్రీనివాసులు 
గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్న మృత దేహాన్ని తీసుకొస్తున్న సమయంలో చూసి అబ్బా... నా కొడుకే అంటూ లోకేష్ తండ్రి పులి శ్రీనివాసులు విలపిస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. ఎంతపని జరిగింది నాయనా...కష్టపడి చదివించామని, చేతికొచ్చిన ఆధారం పోతే ఎలా బతకాలని బోరున విలపించారు. ఈయన కారుడ్రైవర్‌గా పని చేస్తున్నారు.

పుష్కరాలకు ప్రచారం ఎందుకు : వాణి, హరిగోపి తల్లి
‘పిల్లలందరూ పదింటికి నందిగామలో మా ఇంటి దగ్గర నుంచే బయలుదేరి పుష్కరస్నానాలకు వచ్చారు. కళాశాల వారు సైతం యూనిఫాం వేసుకుని రమ్మన్నారని చెప్పటంతో ఇంటికి వచ్చామన్నారు. పిల్లలను కాపాడలేని పోలీసులు ఉంటే ఏమి లేకపోతే ఏమిటి’ అంటూ మృతుడు హరిగోపి తల్లి వాణి గుండెలవిసేలా రోదించారు. శవాలను వెలికితీస్తుంటే బయట పడ్డ శవం ఎవరిదని అంటూ ఆతల్లి అటువైపుగా పరుగుతీయటాన్ని చూసి పలువరు చలించారు. పుష్కరాలకు ప్రచారం ఎందుకు..తగలబడ్డ పుష్కరాలు ప్రాణాలు తీయటానికా అంటూ శాపనార్ధాలు పెట్టారు.

నాకు ఒక్కడే కొడుకు..మేము ఎవరి కోసం బతకాలి....వాడులేని జీవితం మాకెందుకు వాడిని చూడకుండా ఉండలేనయ్యా అంటూ ఆతల్లి విలవిలాడింది. మమ్మల్ని తీసుకుని వెళ్తే పోయేది అంటూ బోరున విలపిచింది. బాధతో సీఎంను శాపనార్థాలు పెడుతున్న ఆమెను పక్కనే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మీ పిల్లలను బాబు ఏమన్నా ఈతకు వెళ్ళామన్నాడా అంటూ గొడవకు దిగారు. అయితే రెట్టించిన బాధతో ఆమె‘ నీ తలకాయ నెరిసింది..బుధ్ధి ఉందా’మమ్మల్సి చంపడయ్యా అంటూ ఆమె రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలచి వేసింది.

మమ్మల్ని ఆన్యాయం చేశావే... గోపిరెడ్డి తల్లి
మమ్మల్ని అన్యాయం చేయటానికి ఇక్కడకు వచ్చావా నాయనా గోపిరెడ్డి తల్లి కొడుకు శవంపై పడి బోరున విలపించింది. తండ్రి వెంకటేశ్వరెడ్డికి నోట మాట రాక శవంపై పడి అలాగే ఉండిపోయారు. వారిని ఓదార్చటం ఏవరి తరం కాలేదు. వీరికి ఒక్కడే కుమారుడు. మరో సంతానం శ్రావణి డిగ్రీ చదువుతోంది.

మేమంతా ప్రాణ స్నేహితులం...విజయకుమార్ (స్నానం కోసం వచ్చిన తోటి విద్యార్ధి)
ఒక్కొక్క శవాన్ని ఒడ్డుకు వెలికి తీస్తుంటే...వారిని చూసి వారితో పాటు వచ్చిన తోటివిద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. అటు వద్దన్నాం...వద్దన్నా వెళుతుంటే ఆపుదామని చూశాం...ఆ లోపే లోపలికి వెళ్ళారు. ఐదుగురు నడుచుకుంటూ వెళ్లారు. ఒకరు కింద పడగానే. మిగిలిన అందరు చేతులు పట్లుకొని వాడిని లాగే ప్రయత్నంలో అందరు పెద్ద నీటి గుంత కావడంతో బయటకు రాలేక నీట మునిగిపోయారు.

రక్షించేందుకు ప్రయత్నించాను :  వంశీ
నాకు కొంత మేర ఈత రావటంతో స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించాను. నీటిలో పడిపోయిన ఇద్దరు రెండు కాళ్లు పట్టుకోవటంతో ఎలాగోలగా నేను నీటి నుండి బయటపడ్డా..వారిని రక్షించలేకపోయా..గజ ఈతగాళ్ళకు సమాచారాన్ని అందించా. మనోజ్‌కుమార్ , గోపి, దేవివరప్రసాద్‌లందరూ మేమంతా ఒకే బెంచి కూర్చునే వారం. ఎక్కడకి వెళ్ళినా..అంత కలిసే వెళ్ళావాళ్ళమని, ఇక్కడ స్నానం చేస్తామని వచ్చాం.

అక్కడికి వెళ్లొద్దన్నాం : ప్రత్యక్ష సాక్షి ఎస్. సత్యన్నారాయణ
పదకొండు మంది యువకులు బైకులపై ఇక్కడకు వచ్చారు. యువకులు అక్కడ ఉంటే తూర్పు వైపు వెళ్ళాలని, పడమర వైపు వద్దని చెప్పాం. వాళ్ళు అటు ఇటు ఆడుకుంటూ....పడమరవైపుకు వెళ్ళారు. వారు మునిగిపోతూ వేసిన కేకలు వినిపించాయి. ఆ లోపే పడవ వేసుకుని 15 మంది గజఈతగాళ్ళం వెళ్ళాం. అక్కడ చూసినా కనిపించలేదు. అప్పటికే నీట మునిగిపోయారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement