ప్లాస్టిక్‌రహిత నగరానికి సహకరించండి
-
ఫ్లెక్సీల నియంత్రణ పాటించండి
-
మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్ కార్పొరేషన్ : ప్లాస్టిక్ రహితనగరంగా రూపొందేందుకు అన్ని పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని మేయర్ రవీందర్‌సింగ్ కోరారు. ‘ప్లాస్టిక్ పని పట్టేస్తారా..!’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. కమిషనర్ కృష్ణభాస్కర్‌తో కలిసి శుక్రవారం అన్ని పార్టీల నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మేయర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులు సైజుతో సంబంధం లేకుండా నిషేధిస్తున్నట్లు తెలిపారు. శనివారం నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి వస్తాయని చెప్పారు. పాలిథీన్ కవర్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాలపై దాడులు చేసి సామగ్రి జప్తు చేస్తామన్నారు. 40 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న సంచులు కూడా నిషేధం కిందికే వస్తాయన్నారు. పాలిథీన్ బ్యాగులకు ప్రత్యామ్నాయాలు చేసుకోవాలని వ్యాపారులకు సూచించారు. అలాగే నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం తన పుట్టినరోజు అయినప్పటికీ ఎవరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయెుద్దని కోరారు. ఎవరైన కడితే వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. హోర్డింగ్‌లు మినహా ఎక్కడ ఫ్లెక్సీలు కడితే చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. సభలు, సమావేశాలు నిర్వహించే స్టేజీ బ్యానర్ మినహా ఫ్లెక్సీలు కనిపించొద్దని సూచించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సాన రాజయ్య, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కర్ర రాజశేఖర్, బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి పుట్ట నరేందర్, కళ్యాడపు ఆగయ్య, సీపీఐ నగర కార్యదర్శి పైడిపెల్లి రాజు, ఏఐఎంఐఎం నగర అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌షమీ, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.జమీలొద్దీన్, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.