బ్యాంకులో లెక్కతేలని దోపిడీ | froding in pacs society | Sakshi
Sakshi News home page

బ్యాంకులో లెక్కతేలని దోపిడీ

Published Fri, Aug 5 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

బ్యాంకులో లెక్కతేలని దోపిడీ

బ్యాంకులో లెక్కతేలని దోపిడీ

  • అంకెలగారడీతో మాయం చేశారు
  • ఏసీఈవో, అకౌంటెంట్‌ నిర్వాకం
  • తిమ్మాపూర్‌ : జిల్లాలో పేరున్న సంఘాలలో పోరండ్ల సహకార పరపతి సంఘం ఒకటి. సంఘం పరిధిలో బ్యాంకు సైతం కొనసాగుతోంది. లావాదేవీలతోపాటు డిపాజిట్లు, పంట రుణాలు, బంగారు ఆభరణాలపై  రుణాలు, భూమి తనఖా, లాంగ్‌ టర్మ్‌ రుణాలను సంఘం పరిధిలోని బ్యాంకు ద్వారా కొనసాగుతున్నాయి.  ఏడాది క్రితం వరకు పరిస్థితి బాగానే ఉన్నా  ఉద్యోగుల వ్యవహారం సంఘానికే మచ్చతెచ్చేలా తయారైంది. 2015–2016 సంవత్సరంలో అంకెల గారడీ చేసి లక్షల రూపాయలు మాయం చేశారని తేలింది. అసిస్టెంట్‌ సీఈవో గంగారెడ్డి, అకౌంటెంట్‌ ఆగయ్య తమ తెలివితేటలతో లక్షల రూపాయలను కాజేయగా వీరి దోపిడీ ఇటీవల జరిగిన ఆడిట్‌లో బయటపడింది. ఇద్దరు కలిసి నలభై లక్షలను మాయం చేశారని ప్రాథమికంగా తెలిసింది. ఇందులో ఆగయ్య  రూ.10లక్షలు, గంగారెడ్డి రూ.30లక్షలు తమ స్వంతానికి వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆడిటర్లు, సంఘ పాలకవర్గం రికవరీ మొదలుపెట్టారు. ఇరవై రోజుల్లో ఇద్దరి నుంచి రూ.40లక్షల వరకు రికవరీ చేసినట్లు పాలకవర్గం తెలిపింది. ఇప్పటికీ బ్యాంకు లావాదేవీల పుస్తకాలు ఆడిటర్‌ వద్దనే ఉండడం.. ఆమె ఆడిట్‌ నివేదికను ఇవ్వకపోవడంతో లెక్కల వ్యవహారం ఇంకా తేలలేదు
    అంకెల గారడీ...
    పోరండ్ల సొసైటీ పరిధిలోని బ్యాంకులో అంకెల గారడీతో ఏసీఈవో, అకౌంటెంట్‌ ఏకంగా రూ.40 లక్షలకుపైగా మాయం చేశారనేది స్పష్టమైంది. బ్యాంకు పొదుపు ఖాతాలలో లావాదేవీలు లేనివాటిని ఎంచుకున్నారు. సుమారు డెబ్బై మందికి చెందిన ఖాతాలలో ఉన్న  మొత్తానికి పక్కన అంకెలను చేర్చి లక్షలున్నట్లు చూపిస్తూ, ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను విత్‌ డ్రా చేస్తున్నట్లు రాసుకున్నారు. సంతకాన్ని పరిశీలించే అధికారి ఏసీఈవో కాగా, డబ్బులు ఇచ్చేది అకౌంటెంట్‌ కావడంతో ఇద్దరూ తమ స్వాహా పర్వాన్ని కొనసాగించారు.
    వడ్డీ మాటేంటీ..?
    ఉద్యోగులు కాజేసిన రూ.40లక్షల బ్యాంకు డబ్బులకు లావాదేవీల రూపంలో వడ్డీ జమయ్యేది. ఏడాది కాలంలో రూ.40లక్షలు వాడుకున్న ఉద్యోగుల నుంచి అంతే మొత్తాన్ని రికవరీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత మొత్తానికి వడ్డీని ఎందుకు వసూలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలుతోపాటు వడ్డీని కలిపి మొత్తం రికవరీ అయ్యేలా చూడాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. 
    చర్యలు తీసుకుంటాం...
    – దేవేందర్‌ రెడ్డి, సంఘం చైర్మన్‌
     ఉద్యోగులు అవకతవకలకు పాల్పడినట్లు ఇరవై రోజుల క్రితమే మా దష్టికి వచ్చింది. ఇప్పటి వరకు రూ.40లక్షలు రికవరీ చేశాము. ఇంకా ఆడిటర్‌ పూర్తి నివేదిక ఇవ్వలేదు. వడ్డీతో కలిపి అసలు రికవరీ చేసి సోమవారం పాలకవర్గ సమావేశంలో ఇద్దరిపై చర్యలు తీసుకుంటాం. సభ్యులు ఆందోళన చెందవద్దు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement