- రెండేళ్లుగా గుర్తించని ఆడిటర్లు
దోపిడీ డొంక కదిలేనా..?
Published Sat, Aug 6 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
తిమ్మాపూర్: తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా మారింది పోరండ్ల సహకార బ్యాంకులో దోపిడీ వ్యవహారం. ఏడాదిలో చేసిన దోపిడీ లక్షల్లో బయటపడగా అంతకు ముందు కూడా డబ్బుల దుర్వినియోగం జరిగినట్లు చర్చ సంఘ పరిధిలో జోరుగా సాగుతోంది. ఇద్దరు ఉద్యోగులు చేసిన అంకెలగారడీని గతంలో సీనియర్ ఆడిటర్లు సైతం గుర్తించలేదని తెలుస్తోంది. ఒక సంవత్సరమే కాకుండా అంతకుముందు కూడా అవినీతి జరిగిందా అనే విషయాన్ని అప్పటి సీనియర్ ఆడిటర్లు మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. బ్యాంకు ఖాతా పుస్తకాలను ఒక గదిలో పెట్టుకుని తాళం వేసినట్లు సమాచారం. సుమారు 2500 మంది సేవింగ్స్ ఖాతాదారులు ఉండగా వారికి సంబంధించిన రికార్డులన్నీ ముగ్గురు ఆడిటర్ల పరిధిలోనే ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఇద్దరు ఉద్యోగులు చేసిన అవినీతి తంతు కేవలం ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం కాలేదని సదరు ఆడిటర్ నిర్ధారణకు వచ్చారు. ఈ ఏడాది ఖాతా పుస్తకాలనే కాకుండా గతం పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆడిటర్ గుర్తించారు. ఇదే విషయాన్ని 2013 నుంచి 2015 వరకు బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలను ఆడిట్ చేసిన ఆడిటర్లకు తెలిపారు. ఆయా సంవత్సరాల్లో ఆడిట్ చేసిన సీనియర్ ఆడిటర్లు మరోసారి ఆడిట్‌ని చేపట్టారు. అందులోనూ అంకెలగారడీ జరిగినట్లు గుర్తించినా, ఎంత మేరకు జరిగిందనేది బయటకు పడలేదని స్థానికంగా గుసగుస మొదలైంది. ముగ్గురూ ఆడిటర్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత ఎవరి నివేదికను వారు పాలకవర్గానికి అప్పగిస్తే ఎంత స్వాహా చేశారనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement