ముంచెత్తె.. | Full rain in KHAMMAM | Sakshi
Sakshi News home page

ముంచెత్తె..

Published Fri, Aug 5 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

తాలిపేరు ప్రాజెక్టు

తాలిపేరు ప్రాజెక్టు

  • వాజేడులో 13.9 సెం.మీ వర్షం
  • జలకళను సంతరించుకున్న వాగులు
  • పల్లెలకు నిలిచిపోయిన రాకపోకలు
  • నీటిలోనే వరి నార్లు, పంట చేలు
  •  
    సాక్షిప్రతినిధి, ఖమ్మం 
    వరుస వర్షాలతో వాగులు వంకలు జలకళను సంతరించుకున్నాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోగా.. పంట చేలు నీటమునిగాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల జిల్లాలో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద క్రమేపీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం గురువారం సాయంత్రానికి 33 అడుగులకు చేరింది. పరీవాహక గ్రామాల్లోని వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వాజేడులో అత్యధికంగా 13.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాచలంతోపాటు కొత్తగూడెం, పినపాక, ఖమ్మం నియోజకవర్గాల్లో భారీ వర్షం కురిసింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 50,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇదే మండలం ఆర్‌.కొత్తగూడెం–కుర్నవల్లి మధ్య చింతగుప్ప దగ్గర చింతవాగు, పెదమిడిసిలేరు దగ్గర వాగులు పొంగి పొర్లుతున్నాయి. వెంకటాపురం మండలం పాత్రాపురం దగ్గర పాలెంవాగు, వెంకటాపురం వద్ద కంకలవాగు, ఆలుబాక వద్ద దిమ్మెలవాగు, వెంకటాపురం దగ్గర రాచవాగు పొంగి ప్రవహిస్తుండటంతో మండలంలో సుమారు 100 ఎకరాల వరి పంట నీటమునిగింది. అలాగే పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో వాజేడు గ్రామం వద్ద ఉన్న దొంగలవాగు, పేరూరు దగ్గర మర్రివాగు, మొరుమూరు కాలనీ వద్ద అల్లివాగు పొంగి పొర్లుతున్నాయి. దుమ్ముగూడెం మండలం గౌరారం వద్ద వాగు పొంగటంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పినపాక నియోజకవర్గంలోని గుండాల, అశ్వాపురం మండలాల్లో వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుండాల మండలంలోని కిన్నెరసాని, గల్లేరువాగు, మల్లన్నవాగు, ఏడుమెలికలవాగు, దున్నపోతులవాగుల ఉధృతితో గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అశ్వాపురం మండలం గొందిగూడెం వద్ద ఇసుక వాగు, తుమ్మలచెరువు వద్ద గుండాల వాగు, లోతువాగు, గొల్లగూడెంలో నేలవాగు ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక పినపాక మండలంలో 200 ఎకరాల్లో వరి నారు నీట మునిగింది. పోతిరెడ్డిపల్లి, ఏడూళ్ల బయ్యారం, సీతంపేట, జానంపేట గ్రామాల్లో వరి నారు మునిగిపోవడంతో రైతులు నష్టపోయారు. పాల్వంచలోని కిన్నెరసానికి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం కిన్నెరసాని ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు నీటిమట్టం 405.1 అడుగులకు చేరింది. బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు 2 గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 
     
    జిల్లాలో నమోదైన వర్షపాతం
    ––––––––––––––––––––––––––––––––
    మండలం వర్షపాతం(సెం.మీ.లలో)
    ––––––––––––––––––––––––––––––––
    వాజేడు 13.9 
    వెంకటాపురం 10.9
    మణుగూరు 10
    దుమ్ముగూడెం 9.4
    చర్ల 7
    అశ్వాపురం 6.4
    బూర్గంపాడు 3.8
    కొత్తగూడెం 3.7
    భద్రాచలం 3.3
    పాల్వంచ 3
    –––––––––––––––––––––––––––––––––– 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement