క్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి భవిష్యత్‌ | future dipends on Quality | Sakshi
Sakshi News home page

క్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి భవిష్యత్‌

Published Sun, Sep 25 2016 5:56 PM | Last Updated on Sun, Sep 2 2018 4:18 PM

క్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి భవిష్యత్‌ - Sakshi

క్వాలిటీ బొగ్గుతోనే సింగరేణికి భవిష్యత్‌

  • అయిల్‌ ధరలు తగ్గడమే ఇందుకు కారణం
  • ‘సాక్షి’తో సింగరేణి ప్రాజెక్ట్సు, ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఎ.మనోహర్‌రావు
  • గోదావరిఖని : ‘సింగరేణి సంస్థ 1970లో ఎదుక్కొన్న క్లిష్టపరిస్థితి నేడు అనుభవిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా అయిల్‌ ధరలు తగ్గడం మూలంగా విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చాలా సులువైంది. తక్కువ ధరకు నాణ్యమైన విదేశీ బొగ్గు లభిస్తుండడంతో దేశంలోని వినియోగదారులు ఆ బొగ్గు వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివలన సింగరేణితోపాటు దేశంలోని ఇతర బొగ్గు సంస్థలు కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి. నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు ఇచ్చినప్పుడే సింగరేణి భవిష్యత్‌ ఉంటుంది’ అని సంస్థ ప్రాజెక్ట్సు, ప్లానింగ్‌ డైరెక్టర్‌ ఎ.మనోహర్‌రావు స్పష్టం అన్నారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వివరాలు ఆయన మాటలో.. 
    బొగ్గు వాడకంపై దుష్ప్రచారం...
    వివిధ వస్తుత్పత్తి సంస్థలలో శక్తిని ఉత్పన్నం చేసేందుకు బొగ్గుతోపాటు అయిల్‌ను వాడుతుంటారు. అయితే ఇన్నాళ్లుగా బొగ్గు ఆధారిత పరిశ్రమల్లో సింగరేణి బొగ్గును విరివిగా ఉపయోగించారు. కానీ అయిల్‌ ధరలు తగ్గించడంతో ఆయా కంపెనీలు బొగ్గును కాకుండా అయిల్‌నే వినియోగించడం మొదలు పెట్టాయి. బొగ్గు వల్ల కాలుష్యం ఎక్కువవుతుందని ఆయిల్‌ కంపెనీలు దుష్ప్రచారం చేశాయి. దీనికితోడు విదేశాల నుంచి కూడా తక్కువ ధరకు బొగ్గు లభ్యమవడంతో కొన్ని కంపెనీలు ఆ బొగ్గునే వాడుతున్నాయి. 1970లో ఇలాంటి పరిస్థితి ఏర్పడగా...సింగరేణి ఆనాడు ఇబ్బందులను ఎదుర్కొన్నది. మళ్లీ 45 ఏళ్ల తర్వాత సింగరేణిలో అదే పరిస్థితి ఏర్పడింది. అయితే విద్యుత్‌ను అతి చౌకగా ఉత్పత్తి చేసేందుకు బొగ్గు ప్రధాన వనరుగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితి తాత్కాలికంగానే ఉండనున్నది. కానీ దీనిని తట్టుకోవడానికి వీలుగా, ప్రస్తుత సంక్షోభం గురించి కార్మికులు, అధికారులకు వివరించి నాణ్యమైన బొగ్గును వెలికితీసేలా వారిని సన్నద్ధం చేస్తున్నాం. అందుకే మల్టీ డిపార్ట్‌మెంట్‌ కమిటీల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాం. 
    కంటిన్యూయస్, లాంగ్‌వాల్‌ విధానంతోనే బొగ్గు ఉత్పత్తి...
    ప్రస్తుతం సింగరేణిలో ఉన్న భూగర్భ గనుల్లో ఒకటి, రెండు గనులు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న కొన్ని గనులతోపాటు రాబోయే కొత్త గనుల్లో కంటిన్యూయస్‌ మైనర్, లాంగ్‌వాల్‌ విధానంతోనే బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. ఈ రెండు విధానాల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేయడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న శాంతిగని, పీవీకే గని, కేటీకే–6, కొత్తగూడెం రాంపూర్‌ గనుల్లో కంటిన్యూయస్‌ మైనర్‌ విధానం, ఆర్కే–7, కేటీకే–5, కెటికె–3 గనుల్లో లాంగ్‌వాల్‌ యంత్రాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక మిగిలిన గనులన్నింటిని కాలనుక్రమంగా మూసివేస్తాం. 
    కొత్త ప్రాజెక్టులివే...
    కేటీకే ఓపెన్‌కాస్ట్‌కు పర్యావరణ అనుమతులు లభించినందున త్వరలోనే ఈ ఓసీపీని ప్రారంభించనున్నాం. అలాగే కేకే–6 గని, కిష్టారం ఓసీపీ, జేవీఆర్‌ ఓసీ–2, కేఓసీ–3 (ఇల్లందు)కు అనుమతులు రానున్నాయి. ఇవి వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి. రామగుండం రీజియన్‌లోని జీడీకే–5వ గనిని  మూసివేసి 5ఏ గనికి కలుపుకుని ఓపెన్‌కాస్ట్‌ ప్రాజెక్టుతోపాటు వకీల్‌పల్లి ఓసీపీని మూడేళ్లలో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఐదు నుంచి పదేళ్లలో జీడీకే–11వ గని కూడా ఓసీపీగా మారే అవకాశాలున్నాయి. భూగర్భ గనుల్లో కంటిన్యూయస్‌ మైనర్, లాంగ్‌వాల్‌ విధానంతో బొగ్గు ఉత్పత్తి చేయడం, ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా బొగ్గు వెలికితీస్తేనే సింగరేణి కంపెనీ బతకగలుగుతుంది. ఇందులో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, అధికారులు జీవనం సాగించగలగుతారు. 
    వారం రోజుల్లోగా సీఎల్‌సీకి ఎన్నికల వివరాలు...
    సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన వివరాలను యాజమాన్యం తరఫున వారం రోజుల్లో ఢిల్లీలోని సెంట్రల్‌ లేబర్‌ కమిషనర్‌ (సీఎల్‌సీ)కు అందజేస్తాం. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య, బూతుల సంఖ్య, ఎక్కడెక్కడ ఓట్లు వేయనున్నారనే తదితర వివరాలను అందజేస్తాం. అక్టోబర్‌ రెండవ వారంలో ఎన్నికలు నిర్వహించేలా యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement