
రాజమండ్రి ఆస్పత్రిలో శవ రాజకీయాలు
రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'శవ' రాజకీయాలకు తెర తీసింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...రాజమండ్రి వస్తున్నారన్న సమాచారం తెలిసి గండేపల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను హడావుడిగా స్వస్థలాలకు తరలింపు చేపట్టింది.
సోమవారం తెల్లవారుజామున గండేపల్లి వద్ద బూడిద లారీ బోల్తా పడిన సంఘటనలో 19మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న వైఎస్ జగన్... మృతుల కుటుంబాలతో పాటు, క్షతగాత్రులను పరామర్శించేందుకు రాజమండ్రి బయల్దేరిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మృతదేహాలను తరలింపు ఆదేశించింది.
అయితే మృతి చెందినవారికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు చెల్లిస్తేనే మృతదేహాలను తరలిస్తామని మృతుల బంధువులు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రి నుంచి తరలించాలని ఆదేశించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.