
భారీ కుట్రను భగ్నం చేసిన నల్లగొండ పోలీసులు
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రత్యర్థులను హతమార్చేందుకు యత్నించిన ఓ ముఠా కుట్రను శుక్రవారం జిల్లా పోలీసులు భగ్నం చేశారు.
మునగాల మండలం నర్సింహులగూడెంలో గత కొంతకాలంగా భూవివాదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ముగ్గురిని హత్య చేసేందుకు యత్నించిన నలుగురి సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో స్కార్పియోలో వెళ్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
వీరు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. గతంలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నల్లగొండ సరిహద్దు జిల్లాలో ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోదాడకు చెందిన వీరిపై పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు చెప్పారు. వారి నుంచి రూ.12 లక్షలు, ఓ స్కార్పియోతో పాటు 3 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.