క్రియాశీల పోరాటాలకు సిద్ధం కండి
Published Wed, Aug 31 2016 12:52 AM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ధన రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా యువత క్రియాశీల పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై పిలుపునిచ్చారు. స్థానిక టుబాకో మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ 20వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మోడీ ప్రభుత్వం మతరాజకీయాలు చేస్తూ, హిందూ మతోన్మాదులను ప్రోత్సహిస్తూ దళిత, ముస్లిం, క్రైస్తవ, మైనార్టీలపై దాడులకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు. మతోన్మాదుల శక్తులకు వ్యతిరేకంగా దేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణకు యువత నడుం బిగించాలని కోరారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చి ధన రాజకీయాలను ఎండగట్టేందుకు విద్యార్థులు, యువజనులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో 70 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తామని, 10 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని బీజేపీ నాయకులు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సినీ నటుడు మాదాల రవి మాట్లాడుతూ సమాజంలో పేరుకుపోయిన అవినీతి, విష సంస్కృతి లాంటి జబ్బులను అభ్యుదయ కళ ద్వారా నయం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా ఔషధమని, దీని కోసం యువత, విద్యార్థులు పోరాడాలని సూచించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు గని, చంద్రానాయక్, బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement